sircilla: కోనరావుపేటలో రూ.95.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
sircilla: కోనరావుపేట కేజీబీవీలో రూ.95.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్. విద్యకే మొదటి ప్రాధాన్యం.
sircilla: కోనరావుపేటలో రూ.95.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, వసతి గదులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
కోనరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56 లక్షలతో నూతన వసతి గృహం, టాయిలెట్ల నిర్మాణానికి, రూ.9.50 లక్షలతో భవిత కేంద్రం నిర్మాణానికి, రూ.30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.95.50 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు కాస్మోటిక్, డైట్ ఛార్జీలను పెంచినట్లు వివరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పోస్టులను సైతం భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కేజీబీవీ, భవిత కేంద్రం, ఐకేపీ గోడౌన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్లు చేపూరి గంగాధర్, బొమ్మెన భాస్కర్‌రావు, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, కోనరావుపేట సర్పంచ్ కాశిరామ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బోయిని దేవరాజు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, జీసీడీఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.




