Kodurupaka: కోదురుపాక పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్

Kodurupaka: రాజన్న సిరిసిల్ల జిల్లా కోదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ సందర్శించి వైద్య సేవలను తనిఖీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 7:04 PM IST
Kodurupaka
X

Kodurupaka: కోదురుపాక పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా పర్యటనలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ కోదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫార్మసీ, ల్యాబొరేటరీ, ఔట్ పేషెంట్ విభాగాలను సందర్శించి వాటి పనితీరును తనిఖీ చేశారు. ఫార్మసీలో మందుల లభ్యత, నిల్వలు, నిర్వహణను పరిశీలించి అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు.

ల్యాబొరేటరీలో రోగులకు నిర్వహిస్తున్న వివిధ పరీక్షలు, అవసరమైన సామగ్రి లభ్యత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అవసరమైన పరీక్షలను సకాలంలో నిర్వహించి, ఫలితాల ఆధారంగా తగిన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఓపీ రికార్డులు, వివిధ రిజిస్టర్లను పరిశీలించి రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు.

ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కేంద్ర సిబ్బందితో నేరుగా మాట్లాడిన డాక్టర్ రవీందర్ నాయక్.. క్షేత్రస్థాయిలో అందుతున్న ఆరోగ్య సేవలు, గర్భిణీలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమని, ప్రతి కుటుంబంతో నిరంతరం సంబంధం కలిగి ఉండాలని సూచించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జ్వర కేసులపై నిరంతర నిఘా ఉంచి, లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే గుర్తించి అవసరమైన పరీక్షలు, చికిత్స అందించాలని సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నిర్మూలించాలని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సమయానుకూలమైన వైద్య సేవలు అందించాలని, మందులు, పరీక్షలకు అవసరమైన సామగ్రి నిరంతరం అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు.

ఈ సందర్శనలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలిన్ ఆల్ఫ్రెడ్, జిల్లా వైద్య అధికారులు డాక్టర్ రాంరెడ్డి, డాక్టర్ నాగేంద్రబాబు, కోదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రేణు ప్రియాంక, జిల్లా డేటా మేనేజర్ కార్తీక్, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA