Sircilla: సిరిసిల్లలో సామాజిక న్యాయంపై భారీ బహిరంగ సభ!

Sircilla: హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అంగూరి రంజిత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

KALEEM, SIRICILLA
Published on: 29 Oct 2026 12:45 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో సామాజిక న్యాయంపై భారీ బహిరంగ సభ!

Sircilla: హైదరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆర్ఎస్ఎఫ్ (RSF) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంగూరి రంజిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె నివాసంలో జరిగిన ఈ భేటీలో పాంచజన్యం, సామాజిక న్యాయం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, సామాజిక న్యాయం వంటి అంశాలపై త్వరలో సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అంగూరి రంజిత్ కవితను కోరారు. దీనికి కవిత సానుకూలంగా స్పందించి, త్వరలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సామాజిక న్యాయంపై బహిరంగ సభ నిర్వహిద్దామని తెలిపినట్లు రంజిత్ వెల్లడించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన అంగూరి రంజిత్.. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కవిత అనేక ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ సమాజంలో ఉత్తేజాన్ని నింపారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు.

గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తున్న కవితను రాజకీయంగా అణచివేసేందుకు అక్రమ కేసులు, జైలు జీవితం, మానసిక వేధింపులు, అవమానాలు ఎదుర్కొనేలా చేశారని రంజిత్ ఆరోపించారు. అయినప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఎక్కడా లొంగకుండా తన పోరాటాన్ని కొనసాగించారని అన్నారు.

కష్టకాలంలో అనేక మంది విస్మరించినప్పటికీ కవిత ధైర్యంగా నిలబడి, ఆత్మగౌరవంతో తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించడం గొప్ప విషయమని రంజిత్ పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని, కవిత వంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కవిత మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అంగూరి రంజిత్ తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA