Karimnagar: కరీంనగర్లో సహజ ప్రసవంపై అవగాహన ర్యాలీ నిర్వహణ
Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సోమీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్ ర్యాలీ; సహజ ప్రసవాలపై అవగాహన, ప్రతిజ్ఞ.
Karimnagar: కరీంనగర్లో సహజ ప్రసవంపై అవగాహన ర్యాలీ నిర్వహణ
కరీంనగర్: సహజ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, వైద్యపరంగా అవసరం లేని సిజేరియన్ శస్త్రచికిత్సలను నివారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు అన్నారు. సహజ ప్రసవాలపై గర్భిణులు, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా మిడ్వైవ్స్ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
కరీంనగర్లోని కోతిరాంపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సొసైటీ ఆఫ్ మిడ్వైవ్స్ ఇండియా (సోమీ) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన 'వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్' సహజ ప్రసవ అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ రాజగోపాల్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ ప్రసవం ప్రకృతి సహజంగా ప్రసాదించిన శారీరక ప్రక్రియ అని, వైద్యపరంగా సురక్షితమైన సందర్భాల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం వల్ల తల్లి త్వరగా కోలుకోవడంతోపాటు తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుందని తెలిపారు.
తల్లిపాలను త్వరగా ప్రారంభించేందుకు కూడా సహజ ప్రసవం దోహదపడుతుందన్నారు. అయితే వైద్యపరంగా సిజేరియన్ అవసరమైన సందర్భాల్లో ఆ విధానాన్ని అనుసరించడం తప్పనిసరని, అవసరం లేనప్పుడు అనవసరమైన శస్త్రచికిత్సలను నివారించాలని సూచించారు. ప్రసవ సమయంలో తల్లులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పిస్తూ నిరంతర సహకారం అందించడంలో మిడ్వైవ్స్ పాత్ర ఎంతో కీలకమని వివరించారు.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కోతిరాంపూర్ నుంచి ప్రారంభమైన సహజ ప్రసవ అవగాహన నడక కలెక్టరేట్ వరకు కొనసాగింది. అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థినులు, వైద్య సిబ్బంది ప్రజలకు సహజ ప్రసవం ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. సహజ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలు, అనవసరమైన వైద్య జోక్యాలను నివారించాల్సిన అవసరం, తల్లి మరియు శిశు ఆరోగ్య సంరక్షణలో మిడ్వైవ్స్ సేవల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.
అనంతరం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తామని, వైద్యపరంగా అవసరం లేని జోక్యాలను నివారించేందుకు కృషి చేస్తామని, ప్రసవ సమయంలో తల్లులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిరంతర సహకారం అందిస్తామని, ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రసూతి సేవలు అందేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, సోమీ కోఆర్డినేటర్ లిల్లీ మేరీ మాట్లాడుతూ.. గర్భిణులకు సహజ ప్రసవంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, నర్సింగ్ విద్యార్థినులు భవిష్యత్తులో వైద్య సేవల్లో భాగంగా తల్లులకు సరైన మార్గదర్శకత్వం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. మిడ్వైవ్స్ సేవలను మరింత బలోపేతం చేయడం ద్వారా మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని, సహజ ప్రసవాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సోమీ కోఆర్డినేటర్ లిల్లీ మేరీ, వైస్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, సోమీ టీమ్ సభ్యురాలు సుజాత, ఎన్ఎస్ఎస్ బృంద సభ్యులు, అధ్యాపక బృందం, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.




