Karimnagar: శాతవాహన వర్సిటీలో భవన విస్తరణ, ఆడిటోరియం పనులకు భూమిపూజ
Karimnagar: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కామర్స్ కళాశాలలో భవన విస్తరణ, ఆడిటోరియం పనులకు వీసీ ఉమేష్ కుమార్ భూమిపూజ; 14 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి.
Karimnagar: శాతవాహన వర్సిటీలో భవన విస్తరణ, ఆడిటోరియం పనులకు భూమిపూజ
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయాన్ని విద్యా, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో భవన విస్తరణలో భాగంగా నూతన ఆడిటోరియం, మొదటి అంతస్తు నిర్మాణ పనులకు ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు.
ఉపకులపతి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాన్ని విద్యాపరంగా, మౌలిక సదుపాయాల పరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ పరిధిలో వివిధ విభాగాలు, అనుబంధ కళాశాలల్లో 14 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధి అంటే కేవలం నూతన భవనాల నిర్మాణం మాత్రమే కాదని, విద్యార్థుల సంక్షేమం, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం కూడా అంతే ముఖ్యమని ఉపకులపతి స్పష్టం చేశారు. విద్యార్థులు విద్యతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని, పోటీ ప్రపంచంలో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకునేలా విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
నూతన ఆడిటోరియం, భవన విస్తరణ పనులు పూర్తయిన అనంతరం కళాశాలలో విద్యా, పరిశోధన, సదస్సులు, వర్క్‌షాప్‌లు, ఇతర అకడమిక్ కార్యక్రమాల నిర్వహణకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఓఎస్డీ డా. డి. హరికాంత్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్, సీడీసీ డీన్ ఆచార్య జాఫర్, కార్యనిర్వాహక మండలి సభ్యులు రవీందర్ రెడ్డి, ఈశ్వర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. రమకాంత్, అధ్యాపకులు డా. ఈ. మనోహర్, డా. కృష్ణకుమార్, డా. తిరుపతి, డా. మనోజ్ కుమార్, డా. బి. నరేష్, డా. బి. పరశురాములు, శ్రీమతి సావిత్రి, డా. అనిల్, శ్రీ కె. నాగరాజు, ఇతర బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




