Karimnagar: మహాచండీ దేవిగా భక్తులకు శ్రీ మహాశక్తి దర్శనం!
Karimnagar: కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Karimnagar: మహాచండీ దేవిగా భక్తులకు శ్రీ మహాశక్తి దర్శనం!
కరీంనగర్: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో మహాచండీ దేవి(కుష్మాండ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలయ నిర్వాహకులు అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మహాచండీ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో చండీదేవి అవతారానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఆదిశక్తి స్వరూపిణిగా పూజలందుకునే చండీదేవి దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని కాపాడే శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. దేవీ మహాత్మ్యం ప్రకారం, మహిషాసురుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించిన జగన్మాత పరాక్రమం అమ్మవారి శక్తిసామర్థ్యాలను చాటిచెబుతుంది.
ఆయుధధారిణిగా, సింహవాహనంపై కొలువుదీరిన చండీదేవి రూపం ధైర్యం, సాహసం, విజయానికి ప్రతీక. చండీదేవిని ఆరాధించడం వల్ల భయం తొలగి, ఆత్మవిశ్వాసం పెరిగి, జీవితంలోని అడ్డంకులను అధిగమించే శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించే విజయానికి చండీదేవి అవతారం ప్రతీకగా నిలుస్తుంది.
మరోవైపు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శక్రవారం మహాశక్తి ఆలయంలో సరస్వతి పూజ నిర్వహించనున్నారు. సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. అట్లాగే రతన్ కుమార్ బ్రుందంతో డ్యాన్స్ కార్యక్రమం కొనసాగనుంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు నిర్వహించే దాండియాలో పాల్గొనే భక్తులంతా రెడ్ కలర్ డ్రెస్ కోడ్ తో రావాలని ఆలయ నిర్వహకులు విజ్ఝప్తి చేశారు.




