Karimnagar: ప్రతిభావంతులకు 100% ఉచిత విద్య: ముద్దసాని రమేష్ రెడ్డి!

Karimnagar: కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్‌కు రికార్డు స్థాయిలో 15,615 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభావంతులకు ఉచిత విద్యను అందిస్తామని యాజమాన్యం తెలిపింది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 1 Nov 2026 9:23 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రతిభావంతులకు 100% ఉచిత విద్య: ముద్దసాని రమేష్ రెడ్డి!

కరీంనగర్: ఉత్తర తెలంగాణలో విద్యారంగంలో విశేష గుర్తింపు పొందిన శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ విద్యాసంస్థల ఐఐటీ–నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నవంబర్ 1వ తేదీన నిర్వహించిన శ్రీ చైతన్య స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్–2026కు రికార్డు స్థాయిలో 15,615 మంది విద్యార్థులు హాజరయ్యారు.

శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన తొమ్మిది కళాశాలల్లో ఈ పరీక్షను అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఊహించని రీతిలో భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షకు హాజరుకావడం పట్ల శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత శ్రీ ముద్దసాని రమేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్‌పై చూపిన ఆసక్తి, ఉత్సాహం ఎంతో సంతోషాన్ని కలిగించాయని పేర్కొన్నారు. విద్యార్థులను ఈ పరీక్షకు హాజరయ్యేలా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, పాఠశాలల కరస్పాండెంట్లకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా నాణ్యమైన విద్యకు దూరమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉన్నత ఆశయంతో ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు 100 శాతం ఉచిత విద్యతో పాటు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఐఐటీ–జేఈఈ మెయిన్స్, నీట్, ఎప్‌సెట్ వంటి పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ, కార్పొరేట్ స్థాయి ఇంటర్మీడియట్ విద్యను అందించడమే తమ లక్ష్యమని వివరించారు.

ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా ల్యాప్‌టాప్, 2వ స్థానం నుంచి 10వ స్థానం వరకు సాధించిన విద్యార్థులకు ట్యాబ్‌లను అందించనున్నారు.

అలాగే పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ కూపన్లు అందజేసి నిర్వహించిన లక్కీ డ్రాలో ఎంపికైన విజేతలకు ప్రోత్సాహక బహుమతులుగా స్మార్ట్ టీవీ, సైకిల్, సెల్‌ఫోన్‌లను అందజేశారు.విజేతలకు ముద్దసాని రమేష్ రెడ్డి స్వయంగా బహుమతులను అందజేసి అభినందించారు.

స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను మూడు నుంచి నాలుగు రోజుల్లో ప్రకటించి విద్యార్థులకు తెలియజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల సెక్రటరీ సాయి చైతన్య రెడ్డి, డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, జూనియర్ కళాశాలల డీన్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపాల్స్, AGM శ్రీనివాస్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU