Karimnagar: కరీంనగర్ రూరల్‌లో గంజాయి స్మగ్లర్ అరెస్ట్.. కిలోకు పైగా గంజాయి స్వాధీనం!
Karimnagar: కరీంనగర్ రూరల్‌లో గంజాయి విక్రయిస్తున్న హిస్టరీ షీటర్ బుర్ర వంశీ అరెస్ట్ 1.14 కేజీల గంజాయి స్వాధీనం, సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని అభినందించిన సీపీ గౌస్ ఆలం.
Karimnagar: కరీంనగర్ రూరల్‌లో గంజాయి స్మగ్లర్ అరెస్ట్.. కిలోకు పైగా గంజాయి స్వాధీనం!
కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయానికి పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1 కిలో 140 గ్రాముల గంజాయి, ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ రూరల్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో, ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది కలిసి ముగ్దంపూర్ వద్ద ఉన్న మైత్రి ఫ్యామిలీ దాబా సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు.
అక్కడ ఒక వ్యక్తి తెల్లని ప్లాస్టిక్ కవర్ పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.
అతడి వద్ద ఉన్న తెల్లని ప్లాస్టిక్ కవర్‌ను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో అతని పేరు బుర్ర వంశీ తండ్రి చంద్రయ్య, వయస్సు 24 సంవత్సరాలు, గౌడ్, ముగ్దంపూర్ గ్రామంగా తెలిసింది. విచారణలో నిందితుడు తాను గతంలో గంజాయి సేవించడానికి అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో యువకులకు, హైవే దాబాల వద్ద లారీ డ్రైవర్లకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల కూడా బైక్‌పై ఒడిశా సరిహద్దు ప్రాంతానికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు, మైత్రి ఫ్యామిలీ దాబా సమీపంలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడిపై గతంలో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్, కరీంనగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ మరియు ఒడిశా రాష్ట్రంలో గంజాయికి సంబంధించిన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అతనిపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ షీట్ కూడా తెరిచినట్లు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న 1 కిలో 140 గ్రాముల గంజాయి మరియు శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసిన కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం అభినందించారు.




