Karimnagar: కరీంనగర్లో గంజాయి విక్రేత అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలం మాలగుట్టల సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 1.1 కిలోల గంజాయి, మొబైల్ స్వాధీనం.
Karimnagar: కరీంనగర్లో గంజాయి విక్రేత అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామం నుంచి జూబ్లీ నగర్‌కు వెళ్లే రహదారిలో మాలగుట్టల సమీపంలో చెట్ల కింద గంజాయిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు .అతని వద్ద నుంచి 1 కిలో 100 గ్రాముల గంజాయి, ఒక రెడ్మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో మరో వ్యక్తి పోలీసులను చూసి బైక్‌పై పరారయ్యాడని అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.
ఈరోజు అందిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, రూరల్ ఎస్ఐ జె. లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి మాలగుట్టల సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు బైక్ పక్కన పెట్టుకుని ప్లాస్టిక్ కవర్లో ఉన్న పదార్థాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఒక వ్యక్తి బైక్‌పై పరారయ్యాడు.
మరో వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పైల్లా శ్రీమాన్ (18), మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. విచారణలో అతను డెకరేషన్ పనులు చేస్తూ, స్నేహితుల ద్వారా గంజాయి సేవనానికి అలవాటు పడ్డానని తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
గంజాయిని చంద్రాపూర్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కరీంనగర్ పరిసర ప్రాంతాలకు తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.100 చొప్పున యువకులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. సుమారు 15 రోజుల క్రితం మరో వ్యక్తితో కలిసి దాదాపు రెండు కిలోల గంజాయిని తీసుకువచ్చి, అందులో కొంత భాగాన్ని ప్యాకెట్లుగా చేసి నగునూర్, జూబ్లీ నగర్, చర్లబూత్కూర్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన గంజాయిని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.
పంచుల సమక్షంలో గంజాయిని తూకం వేసి 1 కిలో 100 గ్రాములుగా నిర్ధారించి, రెడ్మీ మొబైల్ ఫోన్‌తో పాటు పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలో పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
యువత, తల్లిదండ్రులకు పోలీసుల విజ్ఞప్తి...
యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కరీంనగర్ రూరల్ పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యాన్ని, చదువును, భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, బయటకు వెళ్లే సమయాలు, మొబైల్ వినియోగంపై తగిన శ్రద్ధ చూపాలని కోరారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని ఏ గ్రామంలోనైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత చట్టాల ప్రకారం మరింత కఠినమైన చర్యలు చేపడతామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, కష్టపడి చదువుకుని, తమ తల్లిదండ్రులకు, గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి కోరారు.




