Karimnagar: పేదలకు భరోసా కేంద్రంగా నూతన కలెక్టరేట్ నేతల ఆకాంక్ష
Karimnagar: కరీంనగర్ నూతన కలెక్టరేట్ పేదలకు భరోసా కల్పించే పరిపాలనా కేంద్రంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు.
Karimnagar: పేదలకు భరోసా కేంద్రంగా నూతన కలెక్టరేట్ నేతల ఆకాంక్ష
కరీంనగర్: నూతన కలెక్టరేట్ భవనం పేద ప్రజలకు విశ్వాసం, భరోసా కల్పించే విధంగా పనిచేసే పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అధికారులకు సూచించారు. పాత కలెక్టరేట్ దాదాపు 45 సంవత్సరాల పాటు జిల్లా ప్రజలకు పాలన అందించిందని, అనేకమంది జిల్లా కలెక్టర్లు అక్కడి నుంచి అత్యుత్తమ సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారని పేర్కొన్నారు.
పాత కలెక్టరేట్ ఎన్నో పోరాటాలు ఆందోళనలకు వేదికగా నిలిచిందని అదే స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలోను కీలకంగా పని చేసిందని పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ భవనంలోనే నామినేషన్లు వేసి రెండుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అయ్యానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కలెక్టర్ చిత్రా మిశ్రా కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి చక్కగా పనిచేస్తున్నారని తెలిపారు.
రాబోయే రోజుల్లో అధికారులు, ఉద్యోగులు స్ఫూర్తిదాయక సేవలు అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని, అభాగ్యులకు అండగా నిలవాలని సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పేదల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాయని బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కళ్ల వంటివని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.
ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన... జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి ఆగకుండా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేసి పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషి చేయాలని సూచించారు. మనసుపెట్టి పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిచేసేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం మరింత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
అభివృద్ధి ఫలాలను పేదలకు అందించాలి... రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఫలాలు ప్రతి అర్హుడికి అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. నూతన కలెక్టరేట్ భవన సముదాయం పేదల సమస్యల పరిష్కారానికి వేదికగా చక్కగా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లా యంత్రాంగం, అధికారులు సమిష్టిగా పనిచేసి కరీంనగర్ జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.
కొత్త కలెక్టరేట్ ద్వారా మంచి పరిపాలన.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నూతన కలెక్టరేట్ భవన సముదాయం ద్వారా జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు మరింత మంచి పరిపాలన అందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోందని, వాటిని పేద ప్రజలకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు.
ప్రజలకు మంచి సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. నూతన కలెక్టరేట్ భవనం పేదలకు అండగా నిలిచే పరిపాలనా కేంద్రంగా నిరంతరం పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రభుత్వ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ పేదలకు అండగా నిలుస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా పాలన అందిస్తుందని తెలిపారు.
గతంలో తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని శ్రీధర్‌బాబు సూచించారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి.. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జిల్లా యంత్రాంగం, అధికారులు నూతన కలెక్టరేట్ భవనం ద్వారా పేదల సంక్షేమమే లక్ష్యంగా మరింత బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వంపై పేద ప్రజలకు మరింత నమ్మకం, విశ్వాసం కలిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.
నూతన కలెక్టరేట్ భవనం కేవలం పరిపాలనా కార్యకలాపాలకే పరిమితం కాకుండా పేదలు, సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.




