Karimnagar: కరీంనగర్లో 'వందేమాతరం' పోటీల బహుమతుల ప్రదానోత్సవం
Karimnagar: వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకల సందర్భంగా కరీంనగర్ ఫిలింభవన్లో నిర్వహించిన పోటీల విజేతలకు మేయర్ కొలగాని శ్రీనివాస్ బహుమతులు అందజేశారు.
Karimnagar: కరీంనగర్లో 'వందేమాతరం' పోటీల బహుమతుల ప్రదానోత్సవం
కరీంనగర్: వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ఫిలీంభవన్ లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన బృందగానం, అభినయం, చిత్రలేఖన పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, కళాకారులకు మేయర్ స్వయంగా శాలువాలు కప్పి, తన చేతుల మీదుగా బహుమతులను అందజేసి అభినందించారు. ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ, మృధుల వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ"జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో 'వందేమాతరం' గీతం ఎంతో కీలకం అన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గీత ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేస్తూ ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఇలాంటి సాంస్కృతిక, కళా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు దేశభక్తిని, సాంస్కృతిక విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి ప్రతినిధులు, నిర్వాహకులు డాక్టర్ రాజ బాస్కర్ రెడ్డి, డాక్టర్ భాగ్యారెడ్డి, సమద్రాల నాగేశ్వర్ రావు, వెచ్చ మురళి, సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




