Karimnagar: మనోవికాస్ కేంద్రంలో మానసిక ఆరోగ్య దినోత్సవం!

Karimnagar: కరీంనగర్ మనోవికాస్ కేంద్రంలో మానసిక ఆరోగ్య దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు వైద్య పరీక్షలు, తల్లిదండ్రులకు న్యాయ అవగాహన కల్పించినట్లు వెల్లడి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Oct 2026 6:30 PM IST
Karimnagar
X

Karimnagar: మనోవికాస్ కేంద్రంలో మానసిక ఆరోగ్య దినోత్సవం!

Karimnagar: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (అక్టోబర్ 10) సందర్భంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శివకుమార్ అనుమతితో కరీంనగర్‌లోని మనోవికాస్ కేంద్రంలో ముందస్తు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వైద్య పరీక్షలు, తల్లిదండ్రులకు న్యాయ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ మేధో వైకల్యం కలిగిన విద్యార్థుల హక్కులు, సంక్షేమం, భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్య, శిక్షణ, సంరక్షణ అందించేందుకు పెమన్ క్యాంపు సంస్థ ద్వారా మనోవికాస్ కేంద్రంలో అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మేధో వైకల్యం ఉన్నంత మాత్రాన ప్రతిభకు పరిమితులు ఉండవని అన్నారు. సరైన విద్య, శిక్షణ, కుటుంబ ప్రోత్సాహం, సమాజ సహకారం అందితే వారు కూడా విద్య, ఉద్యోగాలు, క్రీడలు, కళలు తదితర రంగాల్లో ఉన్నత విజయాలు సాధించగలరని అన్నారు.

ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వైకల్యం ఒక అడ్డంకి కాదని, సరైన అవకాశం లభిస్తే అది విజయానికి మార్గం అని యశ్వంత్ సింగ్ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల సామర్థ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం చాలా గొప్పదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సదుపాయాలు, పునరావాసం, నైపుణ్య శిక్షణ వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పిల్లల పట్ల జాలి కంటే గౌరవం, సమానత్వం, ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. వైద్య శిబిరంలో విద్యార్థులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు సూచనలు అందించారు. అనంతరం నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల చట్టం-2016, విద్యా హక్కులు, సమానత్వం, వివక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై సంస్థ సభ్యులు, న్యాయవాదులు అవగాహన కల్పించారు.

అవసరమైన సందర్భాల్లో అర్హత కలిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు న్యాయ సేవాసదన్ ను సంప్రదించి న్యాయ సలహా, సహాయం పొందవచ్చని తెలిపారు. మేధో వైకల్యం కలిగిన విద్యార్థుల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, సాధికారత కోసం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తన వంతు సహకారం అందిస్తుందని శ్రీ యశ్వంత్ సింగ్ గారు స్పష్టం చేశారు. మనోవికాస్ వ్యవస్థాపకులు కే.బాలకిషన్ రావు మరణానికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ. కిరణ్ కుమార్, సీహెచ్. చంద్ర ప్రకాష్ రెడ్డి, పి. రంగయ్య, బి. సమతా రాణి, కే. మౌనిక, వైద్యులు యం. భరత్ రాజ్, మహమ్మద్ హారిస్, వేణు మాధవ్, యం. సహనారెడ్డి, మనోవికాస్ సంస్థ బాధ్యులు ప్రిన్సిపల్ డి. ఉమారాణి, కోశాధికారి బి. పరమేశ్వర్, ఉపాధ్యక్షులు సిహెచ్. రామారావు, ఈసీ సభ్యులు యండి. అబ్దుల్ కరీమ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ గాలిపెల్లి నాగేశ్వర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN