Karimnagar: గీతా భవన్ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నేతల తీవ్ర ఆగ్రహం!

Karimnagar: కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన; సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Oct 2026 2:39 PM IST
Karimnagar
X

Karimnagar: గీతా భవన్ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నేతల తీవ్ర ఆగ్రహం!

Karimnagar: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, తొలగించిన ఓటర్లలో అర్హులైన వారిని వెంటనే చేర్చాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఎం,సిపిఐ పార్టీల నాయకులు స్థానిక గీతా భవన్ చౌరస్తాలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి, కేదారిలు మాట్లాడుతూ ఓట్ల దొంగ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకుంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు.. జ్ఞానేష్ కుమార్ సీఈసీగా కాకుండా బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సర్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే 37 లక్షల ఓట్లు తొలగించారన్నారు. దాంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తమిళనాడులో డీఎంకే ఓడిపోయిందని అన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉందన్నారు.

అందుకే బీజేపీ వ్యతిరేక ఓట్లను సుమారు 13 కోట్ల పైచిలుకు ఓట్లు ఈసి తొలగించిందని విమర్శించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈసి ద్వారా ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, అయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడం ప్రజల డిమాండ్ అన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఈసిని నడపాలి కానీ ఆయన నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలమని చెప్పారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈసి పారదర్శకంగా సర్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. కానీ అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తీసేయడం సరైంది కాదన్నారు. అర్హులైన ఓట్లను కేంద్రం, ఈసి తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.

అర్హులైన వారి ఓట్లను తొలగించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. బీజేపీకి ఈసి ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. సర్ పేరుతో జ్ఞానేష్ కుమార్ ఓట్లను తొలగిస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెడపడం లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు.

రాబోయే కాలంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించేంతవరకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు, అభ్యుదయవాదులు ఐక్య పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడి కందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్,

కోనేటి నాగమణి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బి యుగేందర్, సిపిఐ నాయకులు బాకం ఆంజనేయులు, రమేష్, పి బాపురెడ్డి, జువ్వాజి తిరుపతి, సిపిఎం నాయకులు రాయి కంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్, కే అరవింద్, బోగేష్, ఇసాక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN