Jammikunta: జమ్మికుంట బీసీ హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీసీ బాలుర హాస్టల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ బృందం పరిశీలించింది. సొంత భవనం నిర్మించి, మెస్ ఛార్జీలు పెంచాలని జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 28 Oct 2026 5:40 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట బీసీ హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ!

జమ్మికుంట: ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అరకొర వసతుల మధ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని SFI డిమాండ్ చేస్తుందని తెలిపారు.

నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, విద్యార్థులకు అందించే మెస్, కాస్మోటిక్ ఛార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మార్పు రావాలి. కాంగ్రెస్ రావాలి” అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంపై ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

చలికాలం సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జమ్మికుంట బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఒకే గదిలో సుమారు 30 మంది విద్యార్థులు నిద్రించాల్సిన పరిస్థితి ఉందని, కనీసం తలుపులు, కిటికీలు కూడా సరిగా లేవని తెలిపారు.

విద్యార్థులకు సరిపడా గదులు, మరుగుదొడ్లు, ఇతర కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.గత మూడు సంవత్సరాలుగా జమ్మికుంటలోని సంక్షేమ హాస్టల్‌ను మూడు వేర్వేరు ప్రైవేట్ భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

జమ్మికుంట మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జమ్మికుంట బీసీ సంక్షేమ హాస్టల్‌కు నూతన సొంత భవనం నిర్మించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే, రానున్న రోజుల్లో SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.అవసరమైతే మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకుని నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, నాయకులు ఆదిత్య , నిఖిల్ మనోజ్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA