Karimnagar: అలుగునూర్‌లో దీక్షా దివస్ సభాస్థలిని పరిశీలించిన గంగుల
Karimnagar: ఈ నెల 29న కేటీఆర్ హాజరుకానున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లను గంగుల పరిశీలించారు.
Karimnagar: అలుగునూర్‌లో దీక్షా దివస్ సభాస్థలిని పరిశీలించిన గంగుల
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మానకొండూర్ మాజీ జడ్పిటీసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్,పలువురు బిఆర్ ఎస్ నాయకుల తో కలిసి సభాస్థలి పరిసరాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా సభ నిర్వహణకు అనువైన ప్రాంతం, వేదిక ఏర్పాటు, సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ముఖ్యంగా సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాల ఎంపిక, సభా ప్రాంగణానికి వచ్చే మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై నాయకులు సమాలోచనలు జరిపారు.
సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది? పార్కింగ్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి? సభకు వచ్చే వాహనాల రాకపోకలను ఎలా క్రమబద్ధీకరించాలి? అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నేతలు చర్చించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించారు.
కేటీఆర్ రాకతో రాజకీయ ప్రాధాన్యత...
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో అలుగునూర్‌లో నిర్వహించనున్న ఈ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం ఎంపిక మొదలుకొని పార్కింగ్, ఇతర ఏర్పాట్ల వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నాయకులు సమాయత్తమవుతున్నారు.
దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ముందుకు తీసుకెళ్లే దిశగా గంగుల కమలాకర్ నేతృత్వంలో నాయకులు సభాస్థలిని పరిశీలించారు.




