Karimnagar: కొడుకు గెంటేశాడని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు!
Karimnagar: కష్టపడి కొన్న ఇంటిని కొడుకు పేరిట రాస్తే ఇంట్లోంచి గెంటేశాడని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన జమ్మికుంట మండలానికి చెందిన వృద్ధ దంపతులు.
Karimnagar: కొడుకు గెంటేశాడని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు!
Karimnagar: రూపాయి రూపాయి కూడబెట్టి ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడిని చేసిన ఆ తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడన్న నమ్మకంతో సొంత ఇంటిని కుమారుడి పేరుతో గిఫ్ట్ డీడ్ చేసినా ఇప్పుడు అదే కొడుకు తమను ఇంటి నుంచి గెంటేసి రోడ్డుపాలు చేశాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు కుమారుడి నుంచి ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవలపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కుమారుడు దేవలపల్లి రవికుమార్ వృత్తిరీత్యా ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. ఖాదీ పరిశ్రమలో చిరుద్యోగిగా పనిచేసిన తాను పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులతో కరీంనగర్ పట్టణంలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు లక్ష్మణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కగానొక్క కుమారుడు తమను వృద్ధాప్యంలో చూసుకుంటాడన్న నమ్మకంతో ఆ ఇంటిని అతని పేరుతో గిఫ్ట్ డీడ్ చేశామని తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత కుమారుడు, కోడలు తమను ఇంటి నుంచి బయటకు పంపించారని వాపోయారు. ప్రస్తుతం ఆ ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై స్థానిక పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని తెలిపారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తాము ప్రస్తుతం సొంత గూడు లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ సొంత ఇంటి వద్దకు వెళ్లినప్పుడు కుమారుడు, కోడలు తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమకు ప్రాణరక్షణ కల్పించడంతో పాటు, తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇంటిలో తాము జీవించేలా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను వారు వేడుకున్నారు.




