Karimnagar: శాతవాహన వర్సిటీలో 'డిజైన్ యువర్ డెస్టినీ' ప్రసంగం

Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో 'డిజైన్ యువర్ డెస్టినీ' కార్యక్రమంలో స్వీయ ప్రేరణ, నైపుణ్యాలు, ఏఐ భాగస్వామ్యంపై రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి ప్రసంగించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 Nov 2026 9:44 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీలో 'డిజైన్ యువర్ డెస్టినీ' ప్రసంగం

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం – సెంటర్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో "డిజైన్ యువర్ డెస్టినీ" అనే అంశంపై ప్రత్యేక ఎక్సటెన్షన్ కార్యక్రమం విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సి. పార్థసారథి, ఐఏఎస్ (రిటైర్డ్) ముఖ్య వక్తగా హాజరుకాగా, శాతవాహన విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు దిశానిర్దేశం చేసే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో సి. పార్థసారథి, ఐఏఎస్ రిటైర్డ్ కీలక అంశాలు వెలిబుచ్చారు.

విద్యార్థులను ఉద్దేశించి సి. పార్థసారథి మాట్లాడుతూ, "హెలికాప్టర్ పేరెంటింగ్" వంటి అతి జాగ్రత్త ధోరణుల నుంచి బయటపడి స్వతంత్రంగా ఆలోచించాలని సూచించారు. సమాజంలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటూ, విశాల దృక్పథం, సామాజిక స్పృహతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బయటి నుంచి వచ్చే తాత్కాలిక ప్రేరణ కంటే, లోపలి నుంచి పుట్టే స్వీయ ప్రేరణ మాత్రమే నిజమైన ప్రేరణ అని, అదే వ్యక్తిలో అంతర్గత మార్పు ను తీసుకొస్తుందని స్పష్టం చేశారు.

కేవలం ప్రాథమిక ప్రవృత్తులకే పరిమితం కాకుండా బుద్ధిని వివేకంతో ఉపయోగిస్తూ, రోజువారీ జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ద్వారానే మన భవిష్యత్తును మనమే రూపొందించుకోగలమని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా ఆచరణాత్మక నైపుణ్యం ఎంతో అవసరమని ఆయన అన్నారు.

సాంకేతికత మరియు కృత్రిమ మేధ రంగంలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ, సరైన ప్రశ్న సంధించినప్పుడు ఎల్ఎల్ఎంలు అన్ని విషయాలకు సమాధానాలు అందిస్తాయని, అందువల్ల ఏఐ ని ఒక శక్తివంతమైన భాగస్వామిగా మలచుకోవాలని సూచించారు. అదే సమయంలో సమాచార మూలాలను ఖచ్చితమైన జ్ఞానంతో ధృవీకరించుకుంటూ, ప్రాథమికాంశాలు, జీవితాంతం కొనసాగే అభ్యసనపై పట్టు సాధించాలని హితవు పలికారు.

విద్యార్థులు అలవర్చుకోవాల్సిన ముఖ్య అంశాలను ఆయన వివరంగా పంచుకుంటూ విద్యార్థులు సమాచారాన్ని యంత్రంలా కాకుండా స్వీయ అభ్యసన కళ, క్రియాశీల అభ్యసన, సహాధ్యాయ బృంద అభ్యసన ద్వారా లోతుగా నేర్చుకోవడంతో పాటు కోరిక, లక్ష్యం, అభిరుచి లను సమన్వయం చేసుకుంటూ, అభిరుచిని లక్ష్యంగా ఎంచుకోవాలని, ప్రస్తుత తరానికి అత్యంత కీలకమైన మానవీయ భావోద్వేగాల, విలువను కాపాడుకోవడంతో పాటు విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం మరియు కేవలం వ్యక్తిగత స్థాయికే పరిమితం కాకుండా విజయం అనేది అర్థవంతంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలన్నారు.

ఆచార్య యు. ఉమేష్ కుమార్ గౌరవ ఉపకులపతి మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన అత్యవసరమని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఆచార్య పి. సతీష్ కుమార్ రిజిస్ట్రార్, విశిష్ట అతిథిగా పాల్గొంటూ, సెంటర్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, మార్గదర్శకత్వం అందించడంలో విశ్వవిద్యాలయం ముందుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, ఐఏఎస్ అదనపు కలెక్టర్,గౌరవ అతిథిగా హాజరై పరిపాలనా అనుభవాలను పంచుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నిబద్ధత, పట్టుదల, ప్రజాసేవా దృక్పథంతో లక్ష్యసాధన వైపు సాగాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎన్. వి. శ్రీరంగా ప్రసాద్ కో-ఆర్డినేటర్, సిసిఇ & ప్రిన్సిపాల్, కామర్స్ కళాశాల సమన్వయం చేయగా, సిసిఇ కో-ఆర్డినేటర్లు డాక్టర్ డి. విజయప్రకాశ్ , డాక్టర్ డి. విజయ్ కుమార్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జాఫర్ డీన్, సిడిసి, డాక్టర్ ఎస్. రమాకాంత్,ప్రిన్సిపాల్, సైన్స్ కళాశాల ఆచార్య వరప్రసాద్ లతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విభాగాధిపతులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR