Karimnagar: కరీంనగర్ డెయిరీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి!

Karimnagar: కరీంనగర్ డెయిరీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, రూ.కోట్ల లావాదేవీలు, భూముల మార్పులపై సీబీఐ విచారణ జరిపించాలని ఏఐఎఫ్‌బీ నేత బండారి శేఖర్ డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Nov 2026 4:33 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ డెయిరీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి!

కరీంనగర్: వేలాది మంది పాడి రైతుల నిరంతర శ్రమ, పాల ప్యాకెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో రూపుదిద్దుకున్న కరీంనగర్ డెయిరీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. డెయిరీ స్థాపన నుండి నేటి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ భూములు, బిల్డింగ్ లు మార్పులు మరియు పరిపాలనా విధానాలు మరియు చట్టపరమైన మార్పులపై సీబీఐ (CBI) తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. డెయిరీ నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, రైతుల హక్కులను, ఆస్తులను కాపాడటానికి ప్రభుత్వ జోక్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.

విజయ డెయిరీ కాస్తా కరీంనగర్ డెయిరీగా ఎలా మారింది? – అనేది ప్రజలు అన్నీ విషయాలు తెల్సుకోవాలని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ ప్రాంతంలో ఉన్న కరీంనగర్ డెయిరీకి దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. నేడు రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సంస్థ ఒకప్పుడు ప్రభుత్వ పరిధిలోని 'విజయ డెయిరీ' పేరుతో కార్యకలాపాలు నిర్వహించేది. అయితే విజయ డెయిరీగా ఉన్న ఈ సంస్థ కరీంనగర్ డెయిరీగా ఎలా మారింది? ఈ మార్పు వెనుక ఉన్న చట్టపరమైన, పరిపాలనా పరిణామాలేమిటి? అనే విషయాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అన్నారు.

కరీంనగర్ ప్రాంతంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు 1971 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు, వ్యవసాయ శాఖ మంత్రి జె. చొక్కారావుల కృషి ద్వారా రోజుకు 12 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ డెయిరీ ప్రారంభమైందన్నారు.

విజయ డెయిరీ అనుబంధం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని Andhra Pradesh Dairy Development Cooperative Federation (APDDCF) పరిధిలోని 'విజయ' బ్రాండ్ కిందే ప్రారంభంలో ఈ సంస్థ ఉత్పత్తులు అమ్ముడయ్యేవి.

Bullet చట్టపరమైన మార్పులు (1997 - 2003): 1997 వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ సంస్థ, 1964 సహకార సంఘాల చట్టం కింద నమోదు కాబడి, 2003 నాటికి 1995 పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం (MACS) కింద పునర్నమోదు చేయబడింది.

Bullet కంపెనీగా మార్పు (2012 జూన్ 1): 2012 జూన్ 1న 1956 కంపెనీల చట్టం ప్రకారం ఈ సంస్థను 'కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌' గా మార్చారు. విజయ బ్రాండ్ స్థానంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడె మొక్కు ప్రతీక అయిన 'నంది' లోగోతో కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెచ్చారు అని తెలిపారు.

రాజకీయ ఆరోపణలు - చుట్టుముట్టిన వివాదాలు

కరీంనగర్ డెయిరీ నిర్వహణ, రైతుల ప్రయోజనాలు, పాల కొనుగోలు ధరలకు సంబంధించి అప్పట్లో తీవ్ర రాజకీయ వివాదాలు చెలరేగాయి, 2014లో అప్పటి కరీంనగర్ ఎంపీ ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు డెయిరీ నిర్వహణ మరియు రైతులకు అందాల్సిన ప్రయోజనాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు లేవనెత్తారని గుర్తు్చేశారు.

AIFB పార్టీ ప్రధాన డిమాండ్లు:

ప్రభుత్వ స్వాధీనం: వేలాది మంది రైతుల కష్టార్జితం, ప్యాకెట్ల విక్రయాల ద్వారా రూపుదిద్దుకున్న కరీంనగర్ డెయిరీ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం వెంటనే తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.

CBI విచారణ: విజయ డెయిరీగా ఉన్న నాటి నుండి కంపెనీగా మారిన ఇప్పటి వరకు జరిగిన నిధుల మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) తో విచారణ జరిపించాలి.

రైతుల ప్రయోజనాల పరిరక్షణ: సహకార సూత్రాలకు విరుద్ధంగా సంస్థను ప్రైవేట్ లేదా కార్పొరేట్ తరహాలో నడపడాన్ని అడ్డుకొని, లాభాలన్నింటినీ నేరుగా పాడి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ డెయిరీ ఆస్తులు వేలాది రైతుల జీవనాధారమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ ఆదేశించకపోతే ఏఐఎఫ్బీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN