Karimnagar: బీజేపీ పాదయాత్రపై ప్రజలకు సమాధానం చెప్పాలి
Karimnagar: నవంబర్ 23న కరీంనగర్లో బీజేపీ పాదయాత్రకు ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం నేత గుడిగందుల సత్యం డిమాండ్; డంపింగ్ యార్డ్, ప్రాజెక్టులపై విమర్శలు.
Karimnagar: బీజేపీ పాదయాత్రపై ప్రజలకు సమాధానం చెప్పాలి
కరీంనగర్: ఈనెల 23న బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబి కరీంనగర్ పాదయాత్రకు వచ్చేముందు కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం నగర కార్యదర్శి గుడిగందుల సత్యం అన్నారు. నగరంలో 20 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్యగా ఉందని బిజెపి మేయర్ పీఠాన్ని ఇస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చెప్తా అని బండి సంజయ్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.
కరీంనగర్ పట్టణంలో మరో ప్రధాన సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడక నడుస్తున్నాయని, రెండుసార్లు ఎంపీగా బండి సంజయ్ గెలిచి నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని అన్నారు. కొత్తపెళ్లి మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పాదయాత్ర అని బిజెపి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. మహిళా హక్కుల్ని అరించి, రైతుల నడ్డి విరిచి, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువతపై కాల్పులు జరిపి లాటి చార్జీలు జరిపి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాము అనడం సిగ్గుచేటు అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షిస్తారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచేదే బిజెపి పార్టీ అని అలాంటి పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. గాంధీ రోడ్డు వైశ్య భవన్ టవర్ సర్కిల్ కమాన్ చివరస్త మీదుగా పాదయాత్ర చేయడం అంటేనే చిరు వ్యాపారస్తులను ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా బిజెపి వ్యవహరిస్తుందని ఈ పాదయాత్ర మూలంగా నగరానికి ఒరిగేది ఏమీలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బిజెపి నగరానికి అభివృద్ధి పనులు చేయాలని సూచించారు.




