Karimnagar: పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలి

Karimnagar: పోలీస్ ఫ్లాగ్ డే 2026 సందర్భంగా వ్యాసరచన, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. అక్టోబర్ 20 ఆఖరు తేదీ.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 10 Oct 2026 9:37 PM IST
Karimnagar
X

Karimnagar: పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలి

కరీంనగర్: అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ ఫ్లాగ్ డే–2026ను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీల్లో విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పిలుపునిచ్చారు.

పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో చేస్తున్న త్యాగాలు, ప్రజల భద్రత కోసం అందిస్తున్న సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.

వ్యాసరచన పోటీలు:

12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో పోలీస్ స్టేషన్ స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన అంశాలు:

- సైబర్ నేరాల నివారణలో పోలీసులు, పౌరుల పాత్ర.

- మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర.

- విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు.

డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ క్రింది అంశాలపై పోటీలు నిర్వహిస్తారు:

- సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర.

- తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంలో నా పాత్ర.

లఘు చిత్రాల పోటీలు:

పోలీసుల సేవలు, త్యాగాలు, ప్రజా భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా తెలుగు, ఉర్దూ లేదా ఆంగ్ల భాషల్లో గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను రూపొందించవచ్చు. యూనిట్ స్థాయిలో ఎంపికైన ఉత్తమ మూడు లఘు చిత్రాలను రాష్ట్రస్థాయి పరిశీలనకు పంపించి, విజేతలకు ప్రతిభా ధ్రువపత్రాలు అందజేస్తారు.

ఫోటోగ్రఫీ పోటీలు:

పోలీసుల విధులు, సేవలు, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసు–ప్రజల సంబంధాలు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది తదితర అంశాలపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు. ఫోటోలు ఇటీవల తీసినవై ఉండటంతో పాటు పోలీసు విధులకు నేరుగా సంబంధించినవై ఉండాలి. యూనిట్ స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఫోటోలను రాష్ట్రస్థాయి పరిశీలనకు పంపించి, ఎంపికైన ఫోటోగ్రాఫర్లకు ప్రతిభా ధ్రువపత్రాలు అందజేస్తారు.

ఎంట్రీల సమర్పణ:

లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనేవారు తమ ఎంట్రీలను సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (SHOs) ద్వారా ఈ నెల 20వ తేదీలోగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి. ఎంపికైన ఎంట్రీలను రాష్ట్రస్థాయి పరిశీలనకు పంపడంతో పాటు, అక్టోబర్ 30, 2026లోగా సంబంధిత పోలీస్ పోర్టళ్లలో అప్‌లోడ్ చేయనున్నారు.

విద్యార్థులు, యువత, ఫోటోగ్రఫీ అభిరుచి కలిగినవారు, పోలీసు సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటడంతో పాటు సమాజంలో అవగాహన పెంపొందించే సందేశాలను సృజనాత్మకంగా అందించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కోరారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN