Karimnagar: సంచార ముస్లింల సమస్యలు పరిష్కరించాలి: బండారి శేఖర్!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సంచార ముస్లిం తెగల సంఘం ధర్నా చేపట్టింది. ప్రత్యేక కార్పొరేషన్, రూ.1,000 కోట్ల బడ్జెట్, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Nov 2026 4:58 PM IST
Karimnagar
X

Karimnagar: సంచార ముస్లింల సమస్యలు పరిష్కరించాలి: బండారి శేఖర్!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం (BC-E 1-14) ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరెట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార ముస్లిం తెగల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అందరితో పాటు వీరికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వంత ఇండ్లు లేని వారికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని లేదా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు...

సంచార ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, నవంబర్ 11న అబ్దుల్ కలాం ఆజాద్ జయంతికి ముందే 'తౌఫా-యే-తాలీమ్' పథకాన్ని ప్రారంభించాలని అన్నారు. కులవృత్తులు కోల్పోయిన సంచార ముస్లింల ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఏడాదికి రూ. 1,000 కోట్లు కేటాయించాలని, అటవీ చట్టాల కారణంగా వృత్తులు కోల్పోయిన గారడీ ముస్లింలు, పాముల సాయబులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధి కోల్పోయిన వారికి రూ. 10 లక్షల వరకు 100% సబ్సిడీతో రుణాలు అందించాలి. సంచార ముస్లింల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం స్థలం మరియు నిధులు కేటాయించాలి.నాయి ముస్లింలు' స్వేచ్ఛగా తమ వృత్తిని చేసుకునే అవకాశం కల్పించాలి.తరతరాలుగా వస్తున్న 'తుర్కాకాశల' వృత్తి కొనసాగేలా గుట్టలు మరియు సంబంధిత ప్రాంతాలపై హక్కులు కల్పించాలి. ప్రమాదకరమైన 'తుర్కాకాశ' మరియు 'అచ్చుకట్ల' వృత్తులలో (అల్యూమినియం, రాగి కరిగించే క్రమంలో) గాయపడిన, అంగవైకల్యం పొందిన లేదా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక పరిహారం మరియు వైద్య సహాయం అందించాలి.

బోరెవాలే, బొంతే వాలే, అత్తరు సాయబు, అచ్చుకణ వృత్తుల ఆధునీకరణకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వృత్తులు కోల్పోయి ఇతర పని చేయలేని స్థితిలో ఉన్న వారికి నెలకు కనీసం ఆర్థిక సాయం/నిరుద్యోగ భృతి అందించాలి. ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుని, నిరుపేద సంచార ముస్లింలకు నివాస, ఉపాధి హక్కులు కల్పించాలని అన్నారు. సంచార ముస్లింలను కేంద్ర బిసి (OBC) జాబితాలో చేర్చాలి. ప్రభుత్వం స్పందించి సంచార ముస్లింల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN