Karimnagar: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
Karimnagar: కరీంనగర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలు; అట్రాసిటీ కేసుల బాధితులకు న్యాయం, సంక్షేమంపై సమీక్ష.
Karimnagar: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
కరీంనగర్: ఎస్సీ, ఎస్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, చైర్ పర్సన్ చిత్రా మిశ్రా అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో వివిధ అంశాలలో వారికి అందాల్సిన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మండల స్థాయి ప్రజావాణిలో ప్రతి నెలా ఒక రోజును ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కేటాయించి, వారి నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించి, ఎస్సీ, ఎస్టీల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చామని, 4 వేల 150 ఎస్సీ లబ్ధిదారులకు, 197 ఎస్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోను ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే పరిష్కరించాలని గృహ నిర్మాణ సంస్థ పీడిని ఆదేశించారు.
విద్యారంగంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, విద్యాసంస్థల్లో సీట్లు తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్ మేళాలు, ఉపాధి అవకాశాలను గురించి వారికి సమాచారం అందించాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారిని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ లో కోర్సుల వివరాలను తెలియజేయాలని, విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఉన్న పథకాలపై ప్రచారం చేయాలని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అదనపు తరగతి గదులు, కొత్త భవనాల నిర్మాణం వంటివాటికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మున్సిపాలిటీల్లో మల్టీ వర్కర్లుగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని, ముఖ్యంగా ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, పరిష్కారం అయిన కేసులు, విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ సమావేశంలో సిపి వెల్లడించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ట్రైనీ కలెక్టర్ హరి ప్రసాద్, ఆర్డీవోలు, షర్మిల, జల కుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పి.భాస్కర్, దామెర సత్యం, వేల్పుల విజయ్ కుమార్, కాడే శంకర్, పి. కేశవరెడ్డి, సూత్రపు బుచ్చి రాములు, సిపెల్లి వీరమాధవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




