Karimnagar: ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో కుంట: కలెక్టర్!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో జలసిరి కార్యక్రమంలో భాగంగా బద్దిపల్లి, నాగుల మల్యాల గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట కుంటలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం పరిశీలించారు.
Karimnagar: ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో కుంట: కలెక్టర్!
కరీంనగర్: ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికీ పంటకుంట తవ్వడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. జలసిరి కార్యక్రమం ద్వారా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లిలో విబి జి రాంజీ కార్యక్రమం ద్వారా నిర్మించిన కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతను, నాగుల మల్యాల గ్రామంలో రైతు ఎడ్ల లత పొలం వద్ద నిర్మించిన పంట కుంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం కింద గుంతల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడం ద్వారా భవిష్యత్తులో నీటి కరువు రాకుండా చూడవచ్చని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద పంట కుంటలు, ప్రభుత్వ భూముల్లో కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతల నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు.
విబి జి రాంజీ కార్యక్రమం ద్వారా ఈ పనులు చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. జలసిరి ద్వారా నీటి వనరులు పెంపొందించేందుకు, రైతులకు మరింత మేలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎల్ నినో నేపథ్యంలో జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జి పనులను చేపట్టామని, వీటిని నిర్మించుకునేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని సూచించారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం పై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో నిర్మించే కమ్యూనిటీ ఇంకుడు గుంతల్లో చేపల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.




