Karimnagar: బాలల భద్రత అందరి బాధ్యత - అడిషనల్ కలెక్టర్ అశ్విని

Karimnagar: బాలల భద్రత, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 14 Nov 2026 9:30 PM IST
Karimnagar
X

Karimnagar: బాలల భద్రత అందరి బాధ్యత - అడిషనల్ కలెక్టర్ అశ్విని

కరీంనగర్: బాలల భద్రత, సంక్షేమానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. పిల్లలు తమ హక్కులు, రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతోపాటు వారి ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే చిన్నారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం పాలకుటీర్ సంక్షేమ ట్రస్టు ఆధ్వర్యంలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌కు మరో ఐదేళ్లపాటు గుర్తింపు పొడిగింపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. సంస్థ నిర్వహణ, పనితీరు, చిన్నారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా భేటీ జన్మోత్సవ్ కిట్లను అందించారు.

ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు...

కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మ్యాజిక్ షో పిల్లలను విశేషంగా అలరించింది. చిన్నారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, కమిటీ సభ్యులు, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ తిరుపతిరావు, డీసీపీఓ పర్వీన్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR