Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ డొల్ల రాజకీయం బట్టబయలు బీఆర్ఎస్ శ్రేణులు

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చల్లా హరిశంకర్, రవీందర్ సింగ్ మండిపాటు; కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Oct 2026 7:50 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ డొల్ల రాజకీయం బట్టబయలు బీఆర్ఎస్ శ్రేణులు

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థపై పీఠం ఎక్కి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. బీజేపీ పాలకవర్గం సాధించిందేమిటో శూన్యమని బీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కమలనాథులు..

నగరానికి ప్రత్యేకంగా తెచ్చిన ఒక్క రూపాయి నిధి ఏంటో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గళం విప్పారు. బీజేపీ ఎన్నికల హామీల డొల్లతనాన్ని, కనీస పాలనావగాహన లేని వైఫల్యాలను ఎండగట్టారు.

​యువత వెల్లువతో కమలనాథుల్లో వణుకు..

కరీంనగర్ నగరంలో గులాబీ కండువా ధరించేందుకు యువత పోటీ పడుతుండటంతో బీజేపీ నాయకుల్లో గుబులు మొదలైందని నాయకులు ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధి పాలన, ఆయన నాయకత్వంపై అపార నమ్మకంతోనే కిసాన్‌నగర్‌కు చెందిన సుమారు 150 మంది యువకులు స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌ పార్టీలోకి క్యూ కట్టారని తెలిపారు.

యువత చేరికలతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నిండితే.. అధికార పార్టీ నేతల్లో మాత్రం వణుకు పుట్టిందని, అందుకే మరుసటి రోజే హడావుడిగా డీలా పడిన ముఖాలతో ర్యాలీలు నిర్వహించాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, గత బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు తామే మోక్షం కల్పించామంటూ సిగ్గులేకుండా బీజేపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో బీజేపీకి చెందిన కార్పొరేటర్లు సైతం కమలం పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

​​'ఊసరవెల్లి' రాజకీయాలు చేసే నాయకుల నైతికతపై నిలదీత:

రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అమ్ముకోవడం, పదవుల కోసం పార్టీలు మారడం మాజీ మేయర్ సునీల్ రావుకే చెల్లుతుందని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అవకాశాలు అనుభవించిన ఆయన.. నగర అభివృద్ధి ప్రధాత గంగుల కమలాకర్‌ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కనీస నిబద్ధత, విశ్వసనీయత లేని ఇటువంటి ఊసరవెల్లి నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు.

​ఈ మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం. అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, యూసుఫ్, అలీ, గాదె రూప- శ్రీనివాస్, జమ్ము, మాజీ కార్పొరేటర్లు, గందె మాధవి- మహేష్, ఎడ్ల అశోక్, ఐలందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు. బిఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN