Karimnagar: రూ.14,846 కోట్లతో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ

Karimnagar: కరీంనగర్‌లో రూ.14,846 కోట్లతో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ. బ్యాంకర్లు, అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Sept 2026 6:29 PM IST
Karimnagar
X

Karimnagar: రూ.14,846 కోట్లతో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ

కరీంనగర్: జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల కింద నిర్దేశించిన రుణ లక్ష్యాలను వందశాతం సాధించేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువతతో పాటు వివిధ వర్గాల లబ్ధిదారులకు ఆర్థిక మద్దతు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఆయా పథకాల కింద పెండింగ్‌లో ఉన్న రుణ ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

రూ.20,000 కోట్లకు పైగా రుణాల మంజూరు....

2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు జిల్లాలో మొత్తం రూ.20,000.67 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఇందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.5,975.41 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,768.59 కోట్లు, విద్యా రుణాలకు రూ.17.31 కోట్లు, గృహ రుణాలకు రూ.197.15 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,242 కోట్ల రుణాలు మంజూరైనట్లు వివరించారు.

రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు...

రైతులు తమ రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాల్లో పెండింగ్‌లో ఉన్న రుణ ప్రతిపాదనలను బ్యాంకులకు అందించి, వాటిని త్వరితగతిన మంజూరు చేసేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రికవరీపై ప్రత్యేక దృష్టి...

వివిధ పథకాల కింద రుణాలు పొందిన లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాలు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించేలా సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించాలని శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలో రుణాల రికవరీని మెరుగుపరిచేందుకు బ్యాంకర్లు, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో అధికారులు చొరవ చూపాలని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద మొదటి, రెండో, మూడో విడత రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని బ్యాంకర్లకు సూచించారు.

రూ.14,846 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.14,846 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ అవసరాలకు రూ.5,755 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.3,583 కోట్లు, విద్యా రుణాలకు రూ.53.25 కోట్లు, గృహ రుణాలకు రూ.328.50 కోట్లు, ఎగుమతి రంగాలకు రూ.12.80 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకు రూ.21.61 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.54.97 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.148.41 కోట్లు, ఇతర రంగాలకు రూ.4,889 కోట్ల రుణాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

సమావేశంలో ఎల్‌డీఎం ఉమాశంకర్ నందన, ఆర్బీఐ అధికారి యశ్వంత్‌సాయి, నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్, ఎస్‌బీఐ ఏజీఎం కె. పద్మజ, యూబీఐ చీఫ్ మేనేజర్, మెప్మా పీడీ స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్, ఉద్యానవన శాఖ అధికారి, డీటీడీఓ, టీజీబీ, కేడీసీసీబీ డీజీఎం, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, కోఆర్డినేటర్లు, కరీంనగర్ లోకల్ బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సాల్మాన్ రాజు, అదనపు డీఆర్‌డీఓ రాకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN