Kalvasrirampur: కాల్వశ్రీరాంపూర్‌లో సోలార్ ప్లాంట్ ప్రారంభం: విప్ విజయరమణ!
Kalvasrirampur: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో రూ.6.64 కోట్ల సోలార్ ప్రాజెక్టులు, 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు.
Kalvasrirampur: కాల్వశ్రీరాంపూర్‌లో సోలార్ ప్లాంట్ ప్రారంభం: విప్ విజయరమణ!
కాల్వశ్రీరాంపూర్ (అక్టోబర్ 28): కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులు, మహిళల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, ఇది నిజమైన రైతుల పక్షపాతి ప్రభుత్వమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో రూ.6.64 కోట్లతో చేపట్టిన సోలార్ ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మంగళవారం ప్రారంభించారు.
మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో రూ. 3.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రాన్ని, అలాగే మండలంలో ఏర్పాటు చేసిన 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం రూ. 2.84 కోట్లతో సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో నిర్మించనున్న మరొక 1 మెగావాట్ సోలార్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనే ప్రథమం: రాష్ట్రంలోనే మొదటిసారిగా మన నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం గర్వకారణమని, దీని ద్వారా సొసైటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
విద్యుత్ ఆదా: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లెలో ఇంటింటికీ సోలార్ అమర్చడం వల్ల ప్రతి కుటుంబానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆదా అయిందని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
మహిళా సంక్షేమం: మహిళా సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించిందని గుర్తుచేశారు. సర్వే నంబర్ 597లో కేటాయించిన 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో మహిళా సంఘాల సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. మహిళలకు 2024 ఫిబ్రవరి నుంచి జీరో వడ్డీతో రుణాలు అందిస్తున్నామని చెప్పారు.
రైతులకు రూ. 2,400 మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు
ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తే, క్వింటాలుకు రూ. 2,400 చొప్పున కొనుగోలు చేయించే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సర్పంచ్ బంగారి రమేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సహకార సొసైటీ జిల్లా అధికారి శ్రీ మాలారెడ్డి, డిఆర్డిఓ కాళిందిని, డిసిఓ రవీందర్, సీఈఓ కోలేటి శ్రీనివాస్, డిపిఎంలు, ఎపిఎం లవ కుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు మౌనిక, సొసైటీ డైరెక్టర్లు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




