Karimnagar: జ్యోతిష్మతి కళాశాలలో ఘనంగా పెర్ల్ జూబ్లీ వేడుకలకు శ్రీకారం!
Karimnagar: కరీంనగర్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 30 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని పెర్ల్ జూబ్లీ వేడుకలను ఘనంగా ప్రారంభించింది.
Karimnagar: జ్యోతిష్మతి కళాశాలలో ఘనంగా పెర్ల్ జూబ్లీ వేడుకలకు శ్రీకారం!
Karimnagar: నాణ్యమైన విద్య, నూతన ఆవిష్కరణలు, పరిశోధన మరియు విద్యా రంగంలో విశిష్ట ప్రస్థానంతో మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జిట్స్), కరీంనగర్ తన 30 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పెర్ల్ జూబ్లీ వేడుకలను ఘనంగా ప్రారంభించింది.
ఈ సందర్భంగా కళాశాల లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పెర్ల్ జూబ్లీ లోగోను, ఏడాది పొడవునా నిర్వహించనున్న వేడుకలు మరియు కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుమిత్ సాయి ఆవిష్కరించారు.
గత వైభవాన్ని వేడుకగా జరుపుకుంటూ ఉజ్వల భవిష్యత్తుకు స్ఫూర్తినిద్దాం”అనే నినాదంతో ఈ ముత్యోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ జె. సుమిత్ సాయి మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా జ్యోతిష్మతి సాగిస్తున్న విద్యా ప్రస్థానం, సాధించిన విజయాలు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన విశేషాలను వివరించారు. నాణ్యమైన విద్యను అందించడంలో సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.
సంస్థ అభివృద్ధిలో యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మరియు ఇతర భాగస్వాముల సమిష్టి కృషి ఎంతో కీలకమని అభినందించారు. పెర్ల్ జూబ్లీ వేడుకలను ప్రతి ఒక్కరూ తమ వేడుకగా భావించి ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ, విద్యా రంగంలో మూడు దశాబ్దాల సేవను పూర్తి చేసుకున్న జ్యోతిష్మతి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. అకడమిక్ ఎక్సలెన్స్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి మరియు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి ద్వారా సంస్థ ఘనమైన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
సంస్థ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి కృషి అభినందనీయమని పేర్కొంటూ, పెర్ల్ జూబ్లీ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. రానున్న కాలంలో విద్య, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పెర్ల్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఏడాది పొడవునా మొత్తం 16 ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. వీటిలో అంతర్జాతీయ సదస్సు, పాఠశాల, ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా విద్యార్థుల కోసం జిల్లా స్థాయి క్రీడా పోటీలు, రాష్ట్ర స్థాయి హ్యాకథాన్, అంతర్ కళాశాల సాంకేతిక మరియు క్రీడా పోటీలు, ప్రాజెక్ట్ ఎక్స్పో, సాంస్కృతిక
మరియు క్రీడా కార్యక్రమాలు, ఆన్లైన్ అతిథి ఉపన్యాసాలు, పూర్వ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, గ్రాడ్యుయేషన్ డే–2027, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు, సామాజిక సేవా మరియు ప్రజా చైతన్య కార్యక్రమాలు తదితరాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో డీన్ – అకడమిక్స్ అండ్ ఆడిట్ డా పి కె వైశాలి, అన్ని విభాగాల అధిపతులు, డిప్లొమా ఇన్చార్జి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




