Karimnagar: నారాయణపూర్ ముంపు బాధితులతో కలెక్టర్, ఎమ్మెల్యే భేటీ

Karimnagar: నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు సమస్యలపై కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామస్తులతో కలెక్టరేట్‌లో చర్చించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 21 Sept 2026 7:52 PM IST
Karimnagar
X

Karimnagar: నారాయణపూర్ ముంపు బాధితులతో కలెక్టర్, ఎమ్మెల్యే భేటీ

కరీంనగర్ : నారాయణపూర్ రిజర్వాయర్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని, అప్పటివరకు సంయమనం పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కోరారు. ఒకవేళ ముంపు గ్రామంగా ప్రకటించే అవకాశం లేకపోతే, గ్రామస్తులకు అనువైన ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామస్తుల సమస్యలను విన్న ఎమ్మెల్యే, కలెక్టర్..

సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, రిజర్వాయర్‌ కారణంగా తలెత్తుతున్న సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల అభ్యర్థనలు, సమస్యలను కలెక్టర్‌ పూర్తిగా విన్నారు.

పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించా..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయర్‌ ద్వారా చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలనే అంశాన్ని తాను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించానని తెలిపారు. గ్రామస్తుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ని నారాయణపూర్ గ్రామానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి కూడా గ్రామస్తుల సమస్యలను తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే వివరించారు.

ఆందోళన వద్దు..

నారాయణపూర్ ప్రజలకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, ఆందోళనలకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి ప్రయత్నిద్దామని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎవరికీ అన్యాయం జరగదని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.

సమగ్ర నివేదిక ప్రభుత్వానికి

అందిస్తాం..

భూసేకరణకు గ్రామస్తులు సహకరించాలి..

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

నారాయణపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన సర్వే ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే, నీటిపారుదల తదితర శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించి అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఒక కమిటీ ద్వారా నారాయణపూర్ గ్రామస్తుల సమస్యలను సమగ్రంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను నివేదికలో పొందుపరుస్తామని, గ్రామానికి ఎంత మేర ముంపు ప్రభావం ఉంటుందో, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో శాస్త్రీయంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పాక్షికంగా ముంపునకు గురయ్యే వారికి కూడా తగిన పరిహారం కల్పించేలా ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గ్రామస్తులు అధికారులకు సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రభుత్వం గ్రామస్తులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రిజర్వాయర్ కు సంబంధించి చేపడుతున్న భూసేకరణకు గ్రామస్తులు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని సహకరించాలని పేర్కొన్నారు. భూ సేకరణకు సంబంధించిన అంశంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తమకు విన్నవించవచ్చని తద్వారా విచారణ జరిపి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేశ్వరి, గంగాధర తహసీల్దార్‌ రజిత తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN