Sircilla: విద్యుత్ శాఖలో వేధింపుల కలకలం..జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సస్పెన్షన్!

Sircilla: మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సిరిసిల్ల CESS సర్కిల్ ఆఫీస్ JAO K. రవి సస్పెన్షన్. విజిలెన్స్ విచారణ అనంతరం చర్యలు తీసుకున్న సీఎండీ.

KALEEM, SIRICILLA
Published on: 4 Oct 2026 8:01 AM IST
Sircilla
X

Sircilla: విద్యుత్ శాఖలో వేధింపుల కలకలం..జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సస్పెన్షన్!

Sircilla: సిరిసిల్ల విద్యుత్ శాఖలో మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో ఓ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. సిరిసిల్ల CESS సర్కిల్ ఆఫీస్ ADM సెక్షన్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న K. రవిపై అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో CESS మేనేజింగ్ డైరెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదును పరిశీలించిన సిరిసిల్ల విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు.. విచారణ కోసం ఉమెన్స్ కమిటీకి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉమెన్స్ కమిటీ విచారణ అనంతరం నివేదికను ఎస్ఈకి సమర్పించినట్లు సమాచారం.

అనంతరం తదుపరి విచారణ కోసం ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులకు పంపినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టి సంబంధిత నివేదికలను శాఖ సీఎండీకి సమర్పించినట్లు సమాచారం. విజిలెన్స్ నివేదికలను పరిశీలించిన సీఎండీ.. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎస్ఈ సూచనల మేరకు CESS మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి అక్టోబర్ 1న K. రవిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వుల ప్రకారం 01-10-2026 మధ్యాహ్నం నుంచి ఆయనను సస్పెన్షన్‌లో ఉంచారు.

సస్పెన్షన్ కాలంలో K. రవి హెడ్‌క్వార్టర్స్ అయిన సిరిసిల్లను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లాల్సి వస్తే CESS మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు నిబంధనల ప్రకారం సబ్సిస్టెన్స్ అలవెన్స్ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సదరు అధికారిపై గతంలోనూ మహిళా ఉద్యోగులను వేధించారనే ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నట్లు శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలక విభాగాల్లో పోస్టింగులకు సంబంధించి కూడా ఆయనపై విమర్శలు ఉన్నట్లు సమాచారం. గతంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు, ఏసీబీకి పట్టుబడ్డారనే ప్రచారం కూడా వినిపిస్తున్నప్పటికీ.. ఈ అంశాలకు సంబంధించి అధికారికంగా ధృవీకరించిన వివరాలు అందుబాటులో లేవు.

మరోవైపు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్‌లో K. రవి కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం. మహిళా ఉద్యోగి ఫిర్యాదు నుంచి ప్రారంభమైన వ్యవహారం ఉమెన్స్ కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తు అనంతరం సస్పెన్షన్ వరకు చేరడంతో సిరిసిల్ల విద్యుత్ శాఖలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం K. రవి సస్పెన్షన్‌లో ఉండగా.. క్రమశిక్షణా విచారణ కొనసాగనుంది. విచారణలో వెలువడే తుది నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA