Jagtial: నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే ఆదేశం!

Jagtial: జగిత్యాల ధరూర్ క్యాంప్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం, మున్సిపల్ అద్దెలపై సమీక్ష.:

ANAND, JAGITYAL
Published on: 18 Sept 2026 5:54 PM IST
Jagtial
X

Jagtial: నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే ఆదేశం!

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ రామాలయం నుండి మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల వరకు నిర్మిస్తున్న నూతన రహదారి పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. రహదారి నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం కొత్త బస్టాండ్ ఆవరణలో చేపడుతున్న నూతన వాటర్ ట్యాంక్, తాగునీటి పైప్‌లైన్ పనులను తనిఖీ చేశారు. ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దు:

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలు వరుసగా మూడుసార్లు తిరస్కరించినా, కొందరు కావాలని అధికారులకు, అభివృద్ధి పనులకు అడ్డుపడటం బాధాకరమన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల బీటీ రోడ్డు కొంత దెబ్బతిన్నదని, త్వరలోనే నాణ్యతతో పునరుద్ధరిస్తామని తెలిపారు. జగిత్యాల పట్టణంలో పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయని, ప్రజల సహకారంతోనే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణాభివృద్ధే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

దుకాణ సముదాయాల అద్దెలపై సమీక్ష:

మున్సిపల్ పరిధిలోని దుకాణ సముదాయాల అద్దెలపై ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా సమీక్ష జరపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బకాయిలు చెల్లించని దుకాణదారులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే చర్యలు చేపడుతున్నట్లు పేరొన్నారు.

హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు:

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, ఆర్‌బీడీఈ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, కో-ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుమల రాజ్ కుమార్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, జుంబర్తి రాజ్ కుమార్, కోరుకంటి రాము, తిరుమలయ్య, చీటి లక్ష్మీనారాయణ, నాయకులు సుధాకర్ రావు, ప్రభాకర్, చందా పృథ్వీ, అరుముల్ల పవన్, కప్పల శ్రీకాంత్, రమేష్, స్వామి, ఈశ్వర్ మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL