Jagtial: జగిత్యాల ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘AURA 2K26’ ఫ్రెషర్స్ డే!

Jagtial: జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘AURA 2K26’ ఘనంగా నిర్వహణ కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెల్లడి.. రూ.50 వేల పుస్తకాల విరాళం.

ANAND, JAGITYAL
Published on: 1 Oct 2026 9:23 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘AURA 2K26’ ఫ్రెషర్స్ డే!

జగిత్యాల, అక్టోబర్ 1: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ (స్వయంప్రతిపత్తి) కళాశాలలో గురువారం నిర్వహించిన ‘AURA 2K26 – A GenZ Gala’ ఫ్రెషర్స్ పార్టీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

జగిత్యాల ప్రభుత్వ మహిళా కళాశాల కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్యా ప్రమాణాలను పెంచుకుంటూ ముందంజలో ఉందాని ఎమ్మెల్యే ప్రశంసించారు. విద్యార్థినులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం BFSI, హెల్త్‌కేర్ రంగాలకు సంబంధించిన AEDP వంటి నూతన కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. AI (కృత్రిమ మేధస్సు) విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది ఎన్నటికీ ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్త, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ జగిత్యాల ఇన్‌‌చార్జి శ్రీ మంచాల కృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు మానవీయ విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆయన కోరారు. అలాగే కళాశాల గ్రంథాలయానికి తన వంతుగా ₹50,000 విలువైన పుస్తకాలను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు:

నూతనంగా చేరిన విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ జానపద నృత్యాలు, వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు, సినీ గీతాల నృత్యాలు సభికులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు రాజు, సీనియర్ జర్నలిస్ట్ టీవీ సూర్యం, వార్డు సభ్యులు తిరుమలయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. చంద్రయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. ప్రమోద్ కుమార్, అధ్యాపకులు ప్రొఫెసర్ వి. వరప్రసాద్, డాక్టర్ ఎన్. వాసవి, జి. రాంచంద్రమ్, జి. నీరజ, డాక్టర్ డి. సుజాత, ఎస్. మల్లికార్జున్, డాక్టర్ ఎన్. సంగీత రాణి, డాక్టర్ జి. శ్రీలత, డాక్టర్ జమునలతో పాటు 1,000 మందికి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL