Jagtial: జగిత్యాలలో రైతుల నిరసన, పెంచిన పరిహారం చెల్లించాలని డిమాండ్!
Jagtial: జగిత్యాలలో లింగంపేట రైల్వే స్టేషన్ భూనిర్వాసిత రైతుల ఆందోళన. కోర్టు ఉత్తర్వులున్నా పరిహారం చెల్లించలేదని ఆగ్రహం.
Jagtial: జగిత్యాలలో రైతుల నిరసన, పెంచిన పరిహారం చెల్లించాలని డిమాండ్!
Jagtial: లింగంపేట రైల్వే స్టేషన్ నిర్మాణానికి సేకరించిన భూములకు సంబంధించిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులైన రైతులు శుక్రవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
రైతుల కథనం ప్రకారం... దాదాపు 30 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణంలోని లింగంపేట రైల్వే స్టేషన్ కోసం అధికారులు సుమారు 100 ఎకరాల భూమిని సేకరించారు. ఆ సమయంలో గుంటకు రూ. 5,000 చొప్పున మాత్రమే పరిహారం ఇవ్వడంతో, ఆ మొత్తం సరిపోదని భావించిన రైతులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు, రైతులకు పరిహారం మొత్తం పెంచి చెల్లించాలని అధికారులను ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వులు జారీ చేసి సుదీర్ఘ కాలం గడుస్తున్నా అధికారులు నష్టపరిహారం చెల్లించకపోవడంతో, శుక్రవారం కోర్టు ప్రతినిధులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రిని జప్తు (అటాచ్) చేయడానికి వచ్చారు. అయితే, కార్యాలయంలో జప్తు చేయడానికి తగిన సామాగ్రి ఏదీ అందుబాటులో లేకపోవడంతో వారు ఖాళీ చేతులతో వెనుతిరిగారు.
ఈ విషయం తెలుసుకున్న భూనిర్వాసిత రైతులు పెద్ద సంఖ్యలో ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. దశాబ్దాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిహారం అందడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెంచిన పరిహారాన్ని వెంటనే అందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.




