Jagtial: జగిత్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

Jagtial: బీజేపీ నేత భోగ శ్రావణి విమర్శలకు జగిత్యాల కాంగ్రెస్ నేతలు కౌంటర్; బహిరంగ చర్చకు సవాల్, గత మున్సిపల్ పాలనలోని అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరిక.

ANAND, JAGITYAL
Published on: 25 Nov 2026 5:03 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతపై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేసిన విమర్శలను జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఎస్సీ సెల్ డీసీసీ అధ్యక్షుడు దూమాల రాజ్‌కుమార్ మాట్లాడుతూ శ్రావణి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

పదవులు పొంది విమర్శించడం ద్వంద్వ వైఖరి:

డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పదవి పొందిన భోగ శ్రావణి, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఆమె హయాంలో హరితహారం, ట్రాక్టర్లు, స్వీపింగ్ యంత్రాల కొనుగోలు, భూముల విషయంలో జరిగిన అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయని గుర్తు చేశారు. గతంలో పద్మశాలి సేవా సంఘం నుంచి ఆమె కుటుంబ సభ్యులు అవినీతి ఆరోపణలతో బహిష్కరణకు గురైన విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

పద్మశాలి వర్గానికి పెద్దపీట:

కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి వర్గానికి సముచిత స్థానం కల్పిస్తోందని, అందులో భాగంగానే జగిత్యాల, ధర్మపురి మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులను ఆ వర్గానికే కేటాయించామని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిల కోసం రూ.350 కోట్లు విడుదల చేయడంతో పాటు, వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. యూఐడీఎఫ్ (UIDF) కింద రూ.62.5 కోట్లతో జగిత్యాల పట్టణ సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జగిత్యాల అభివృద్ధిపై ఎక్కడ, ఎప్పుడు బహిరంగ చర్చకు పిలిచినా తాను ఒక్కడినే వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధమని నందయ్య సవాల్ విసిరారు.

కేంద్రం నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి:

మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దూమాల రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. చేయూత పెన్షన్లలో చిన్నపాటి సాంకేతిక లోపాలను సరిదిద్దే అవకాశం ఉన్నా బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. అమృత్ 2.0 వంటి పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాయే ఎక్కువగా ఉందని, కేంద్రం నుంచి జగిత్యాలకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో మెడికల్ కాలేజ్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, యావర్ రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అనేక పనులు జరిగాయని తెలిపారు. ప్రజాప్రతినిధులపై ఏకవచనంతో, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బండ శంకర్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL