Jagtial: కార్మికులకు పెన్షన్లు ఇవ్వకుంటే దీక్ష చేస్తా
Jagtial: జగిత్యాలలో అర్హులైన నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని బీజేపీ నేత డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్; లేదంటే నిరాహార దీక్ష హెచ్చరిక.
Jagtial: కార్మికులకు పెన్షన్లు ఇవ్వకుంటే దీక్ష చేస్తా
జగిత్యాల: జిల్లాలోని అర్హులైన నేత, గీత, బీడీ కార్మికులకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి హెచ్చరించారు. జగిత్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయం (కమల నిలయం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేస్తున్న కపట నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని డాక్టర్ భోగ శ్రావణి విమర్శించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 నుండి 3,000 మంది నేత కార్మికులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే, కేవలం 19 మందికి మాత్రమే మంజూరు చేయడం ఏ విధమైన సంక్షేమమని ఆమె ప్రశ్నించారు. కష్టపడితేనే పూట గడిచే పేద కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
కల్లు గీత కార్మికులకు సైతం పెన్షన్లు అందలేదని, దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకునేందుకు సెప్టెంబర్ 16ను చివరి తేదీగా నిర్ణయించి వెబ్సైట్ను మూసివేయడం వల్ల అనేక మంది అర్హులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెబ్సైట్ను పునఃప్రారంభించి, తప్పులు సరిచేసుకునే అవకాశం కల్పించి అర్హులందరికీ పెన్షన్లు అందించే బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉందన్నారు. నేతన్న సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ, కనీసం పార్టీ పదవులు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు ఇక్కడ బీడీ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. బీడీ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పేదలు, కార్మికులు, వృద్ధులందరికీ పెన్షన్లు మంజూరు చేసే వరకు రోడ్డెక్కి ధర్నాలు, నిరాహార దీక్షలతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, 49వ వార్డు కౌన్సిలర్ సిరిపురం శ్రీలత, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు దూరిశెట్టి మమత, వాణిజ్య సెల్ కన్వీనర్ సిరిపురం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పాత రమేష్, నాయకులు ఆముద రాజు, కర్నే రాజేందర్, ఇట్యాల రాము, కుర్మా రమేష్, నక్క జీవన్, కొక్కుల ప్రభాకర్, బోగ నరేష్ తదితరులు పాల్గొన్నారు.




