Gambhiraopet: గంభీరావుపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల రగడ: కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ

Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగి సభ రసాభాసగా మారింది.

KALEEM, SIRICILLA
Published on: 18 Sept 2026 3:04 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: గంభీరావుపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల రగడ: కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారితీసింది.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా అధికారులు కార్డులను అందజేస్తుండగా.. బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 83 శాతం వాటా భరిస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయకుండా.. కార్డులపై ప్రధాని మోదీ ఫొటో లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కోడె రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అధికారులను నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య బాహాబాహీ పరిస్థితి నెలకొంది. దీంతో సభా ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది.

కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు కార్యక్రమం నుంచి వాకౌట్ చేశారు. మోదీ చిత్రపటం ఏర్పాటు చేయకపోవడంపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA