Sircilla: సిరిసిల్ల ప్రజలకు అలర్ట్.. చలి నుండి ఇలా రక్షించుకోండి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ ఆంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు.
Sircilla: సిరిసిల్ల ప్రజలకు అలర్ట్.. చలి నుండి ఇలా రక్షించుకోండి!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తుమ్ములు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారులు నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చిన్నపిల్లలకు స్వెటర్లు, చెవులకు టోపీలు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరింపజేయాలని తెలిపారు. నెలల వయసున్న చిన్నారులను తల్లి ఒడిలో వెచ్చగా ఉంచాలని, ఉదయం ఎండలో కొద్దిసేపు ఉంచాలని సూచించారు. చిన్నారులతో ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకుండా ఉండాలని, వారికి అవసరమైన టీకాలు తప్పనిసరిగా వేయించాలని పేర్కొన్నారు.
ఆస్తమా బాధితులు చల్లని గాలికి, తేమకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రివేళ చల్లగాలి ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, సురక్షితమైన వేడి ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. వాకింగ్‌కు వెళ్లేవారు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్, గ్లౌజులు, స్వెటర్లు ధరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు.




