Gambhiraopet: ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. యువకుల చర్య!
Gambhiraopet: గంభీరావుపేట మెయిన్ రోడ్డుపై తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ వైర్లు. అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక యువకుల తాత్కాలిక చర్య, శాశ్వత పరిష్కారానికి విజ్ఞప్తి.
Gambhiraopet: ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. యువకుల చర్య!
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మెయిన్ రోడ్డుపై విద్యుత్ సర్వీస్ వైర్లు కిందకు వేలాడుతూ వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. వైష్ణవి మిల్క్ పార్లర్ నుంచి రాజస్థాన్ స్వీట్ బండార్ వరకు మెయిన్ విద్యుత్ లైన్‌కు సంబంధించిన వైర్లు రోడ్డుకు తక్కువ ఎత్తులో ఉండటంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ మార్గంలో వడ్ల లారీలు, ఇతర భారీ వాహనాలతో పాటు కోళ్ల ఫారాలకు సంబంధించిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు వాహనాలకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు టీజీఎన్‌పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతో స్థానిక యువకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
బట్టు సాయి సమాచారం మేరకు గుండెల్లి సత్యనారాయణ వెంటనే స్పందించారు. సత్యనారాయణ, బట్టు సాయి, కిరణ్, అనిల్ తదితరులు కలిసి భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, కిందకు వేలాడుతున్న సర్వీస్ వైర్లను పైకి లాగి కట్టారు.
అయితే యువకులు చేపట్టిన ఈ చర్య తాత్కాలిక ఉపశమనం మాత్రమే. విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యుత్ వైర్లను సక్రమంగా ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందుగానే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




