Peddapalli: రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న గుంజపడుగు సర్పంచ్!

Peddapalli: హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మహిళా ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా గుంజపడుగు సర్పంచ్ సంధ్య ఎంపికయ్యారు.

SHANKAR, MANTHANI
Published on: 12 Nov 2026 10:49 AM IST
Peddapalli
X

Peddapalli: రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న గుంజపడుగు సర్పంచ్!

Peddapalli: మహిళా ప్రజాప్రతినిధుల నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ.లో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ ఎంపికయ్యారు.

పెద్దపల్లి జిల్లా నుంచి కేవలం ఇద్దరు మహిళా సర్పంచులకు మాత్రమే ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం లభించగా, వారిలో గుంజపడుగు సర్పంచ్ సంధ్య ఉండటం విశేషం. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొని మహిళా ప్రజాప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ శిక్షణలో గ్రామసభల నిర్వహణ, సమాచార హక్కు చట్టం, గ్రామపంచాయతీ పరిపాలన, మహిళా ప్రజాప్రతినిధుల హక్కులు, బాధ్యతలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం.

ఈ సందర్భంగా సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధులకు ఇలాంటి రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో శిక్షణలో పాల్గొనడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.

ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు, పెద్దపల్లి జిల్లా, మంథని మండల అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI