Karimnagar: పోలీస్ కమిషనరేట్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో మహిళా సిబ్బంది కోసం బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
Karimnagar: పోలీస్ కమిషనరేట్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Karimnagar: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేక చొరవతో పరేడ్ గ్రౌండ్లో ఈ సంబరాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలతో, నృత్యాలతో పరేడ్ గ్రౌండ్లో సందడి చేశారు.
ఈ వేడుకలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శివకుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కుటుంబ సమేతంగా హాజరుకాగా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) సత్యనారాయణ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ... పండుగల వేళల్లో సాధారణ ప్రజల భద్రత కోసం పోలీసులు రేయింబవళ్లు యూనిఫాంలో బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున సిబ్బంది విధుల్లో బిజీగా ఉంటారని, అందువల్ల మహిళా ఉద్యోగులు, సిబ్బంది కుటుంబాలు కూడా పండుగ ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ముందుగానే ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు.
అనంతరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శివకుమార్ మాట్లాడుతూ... ప్రజలంతా ఇళ్లలో సురక్షితంగా, ప్రశాంతంగా పండుగలు జరుపుకుంటున్నారంటే దానికి కారణం పోలీస్ శాఖ నిరంతరం నిర్వహించే బందోబస్తు విధులేనని కొనియాడారు. పోలీసు సిబ్బంది సేవలను అభినందిస్తూ, అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఎఫ్ఓ సత్యనారాయణలు మాట్లాడుతూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే పోలీస్ యంత్రాంగం మరియు మహిళా సిబ్బంది కోసం సీపీ ఆధ్వర్యంలో ఇంతటి చక్కటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సిబ్బంది అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందజేశారు. ఈ వేడుకల్లో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మహిళా అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




