Peddapalli: దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి రథోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు!

Peddapalli: పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి రథోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు పాల్గొని పూజలు చేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 29 Nov 2026 1:02 PM IST
Peddapalli
X

Peddapalli: దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి రథోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు!

Peddapalli: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి రథోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ విజయరమణరావును ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

అనంతరం పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా నుండి అనేక మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తారని, వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆశీస్సులతో సుఖశాంతులతో, పాడిపంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నుండి రైతులు పండించిన పంటలో ఎలాంటి కటింగ్లు లేకుండా చేసి రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచామని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో దేవునిపల్లి గ్రామ సర్పంచ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, బందంపల్లి కౌన్సిలర్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, లక్ష్మీనృసింహస్వామి ఆలయ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI