Vemulawada: సచివాలయంలో వేములవాడ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష!

Vemulawada: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, వీటీడీఏ అభివృద్ధి పనులపై హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు సమీక్షించారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Oct 2026 7:58 PM IST
Vemulawada
X

Vemulawada: సచివాలయంలో వేములవాడ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష!

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు తెలిపారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, ఇతర నిర్మాణ పనులపై మంగళవారం హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (VTADA) ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, సంబంధిత అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం పనుల పురోగతిపై సమీక్షించిన ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

అలాగే శ్రీ విధుశేఖర భారతి స్వామి, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు భక్తుల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.

అధికారులందరూ ఈ పనులను తమ బాధ్యతగా భావించి పూర్తిస్థాయిలో నిమగ్నమై వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA