Sircilla: జానపద కళాకారులకు ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలి
Sircilla: జానపద కళాకారులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ అసోసియేషన్ ఆవిర్భావ వేదికగా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sircilla: జానపద కళాకారులకు ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా: జానపద కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కన్వీనర్ మమ్మద్ సత్తార్, గాయకుడు మాటల తిరుపతి, గాయని తేలు విజయ కోరారు. జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కళలకు తగిన గుర్తింపు కల్పించే లక్ష్యంతో సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేటి సినిమా పరిశ్రమలో జానపద కళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, జానపదం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని వారు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీల మాదిరిగానే జానపద కళాకారులకు కూడా ప్రత్యేక రాయితీలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జానపద కళాకారులు ఆర్థిక పెట్టుబడులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సొంత డబ్బులతో పాటలు, చిన్న కథలు, మినీ సినిమాలు రూపొందిస్తున్నప్పటికీ ఆశించిన ఆదాయం రాక నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళాకారులను గుర్తించి ఆర్థిక సహకారం, ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
జానపద కళారంగంలో పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి శ్రీకారం చుడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నవంబర్ 3న భారీ సాంస్కృతిక కార్యక్రమం
తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని నవంబర్ 3వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది ప్రముఖ జానపద కళాకారులు నాలుగు గంటల పాటు తమ కళాప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రస్థాయి కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించామని, అసోసియేషన్ విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. జానపద కళాకారులకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కళాభిమానులు, కళాపోషకులు పెద్ద సంఖ్యలో హాజరై జానపద కళాకారులకు అండగా నిలవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.




