Gollapalli: రిబ్బన్ కటింగ్ లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!
Gollapalli: గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా తూకం మొదలుకాకపోవడంపై సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Gollapalli: రిబ్బన్ కటింగ్ లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!
Gollapalli: గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై గొల్లపల్లి సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
కొనుగోలు కేంద్రాల్లో రిబ్బన్ కటింగులు, కొబ్బరికాయలు కొట్టడానికే కార్యక్రమాలు పరిమితమయ్యాయని, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,200 వరకు ధర పలకగా, ప్రస్తుతం దళారులు రూ.2,300కే అడుగుతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రారంభం కాకపోవడంతో దళారులు ధరలు తగ్గిస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం ప్రారంభించాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి, దళారుల దోపిడీ నుంచి వారిని కాపాడాలని కొండ రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.




