Karimnagar: చమన్ పల్లిలో మహిళా సంఘ భవనాలను ప్రారంభించిన గంగుల కమలాకర్!

Karimnagar: కరీంనగర్ రూరల్ చమన్ పల్లిలో మహిళా సంఘ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రోడ్ల అభివృద్ధి, సాగునీటి పనులపై కీలక హామీలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 12 Oct 2026 3:14 PM IST
Karimnagar
X

Karimnagar: చమన్ పల్లిలో మహిళా సంఘ భవనాలను ప్రారంభించిన గంగుల కమలాకర్!

Karimnagar: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చమనపల్లి గ్రామంలో మహిళా సంఘం భవనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, చెరువులకు నీటి సరఫరా, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామంలో రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు దశలవారీగా పనులు చేపట్టినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. తొలుత ఇరుకుల్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఆ తర్వాత ఎదురుగట్టు రహదారి, ఎల్లమ్మ రహదారి, ఫకీర్ పేట రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎదురుగట్టు రహదారితోపాటు పెద్ద వంతెన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. అయితే కొన్ని పనులు నిధుల విడుదల, కాంట్రాక్టర్ల సమస్యల కారణంగా ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు.

చామనపల్లి గ్రామంలో రహదారుల అభివృద్ధికి ఇప్పటికే రూ.కోటి 20 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించి, పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. గ్రామంలో రహదారుల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

రైతులకు అండగా ఉంటా..

రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాజసముద్రం చెరువుకు నీటిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. చెరువు ఎండిపోతుందనే ఆందోళనతో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించేందుకు సుమారు కిలోమీటరు పొడవున నీటి సరఫరా కోసం తూము ఏర్పాటు చేయించామని వివరించారు. దీంతో చెరువులోకి నీరు చేరి రైతులకు కొంత ఊరట కలిగిందన్నారు.

రైతులు సమృద్ధిగా పంటలు పండించుకోవాలని, గ్రామంలోని చెరువులు నిండుగా ఉండాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తు సరఫరా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎండ తీవ్రతతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా అధిగమించాలని సూచించారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

గ్రామ సర్పంచి ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యమని గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాల నుంచి నిధులు సాధించి గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

చామనపల్లి గ్రామంలో మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని, మహిళలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలో రహదారులు, సాగునీటి వసతులు మెరుగుపడటంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా తన వంతు కృషి చేస్తానని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.

సంఘం భవనంలోకి ఫర్నిచర్ కావాలని మహిళలు ఎమ్మెల్యేని కోరగా అప్పటికప్పుడు వారికి మూడు సంఘ భవనాలకు సంబంధించిన ఒక్కో సంఘ భవనానికి 30 చొప్పున కుర్చీలతో పాటు బీరువా ఫ్యాన్లు టేబుల్లను తక్షణమే అందిస్తానని వారికి మాటిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక సర్పంచి బోగొండ ఐలయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, నాయకులు సుంకిశాల సంపత్ రావు, మేరుగు సాయి కృష్ణ యాదవ్, కూర శ్యాంసుందర్ రెడ్డి, రంగారెడ్డి, వడ్లకొండ పరశురాములు, ఆయా గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు అధికారులు మహిళా సంఘ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN