Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు: ఎమ్మెల్యే గంగుల

Karimnagar: కరీంనగర్‌లో బ్యూటీ పార్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ముందస్తు బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని నూతన రేట్ చార్ట్‌ను ఆవిష్కరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Oct 2026 9:11 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు: ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్: ప్రపంచంలోనే పువ్వులనే దేవుడిగా కొలిచే ఏకైక అద్భుతమైన పండుగ బతుకమ్మ అని, ఇది మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముఖరంపుర మల్టీపర్పస్ మైదానంలో కరీంనగర్ జిల్లా, నగర, బ్యూటీ పార్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ముందస్తు బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గంగుల కమలాకర్ మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి, పండుగ శోభను ఇనుమడింపజేశారు. అనంతరం మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించుకున్నారు.

​​ఈ సందర్భంగా బ్యూటీ పార్లర్ అసోసియేషన్ రూపొందించిన నూతన రేట్ చార్ట్‌ను ఆయన మహిళలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీ ప్రపంచంలో బ్యూటీ పార్లర్ల ధరల విషయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఒకే రకమైన ధరలను నిర్ణయించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ నిర్ణయం వల్ల ఇటు వినియోగదారులకు న్యాయం జరుగుతుందని, అటు పార్లర్ యజమానులకు కూడా నష్టం వాటిల్లకుండా వ్యాపారం సాగుతుందని స్పష్టం చేశారు. ఎవరికి నచ్చినట్లు వారు ధరలు విధిస్తే చివరికి యజమానులే నష్టపోయే ప్రమాదం ఉంటుందని, ఇలా ఐక్యతతో ముందుకు సాగడం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు నలువాల పుష్పలత- రవీందర్, చొప్పరి జయ శ్రీ, తాటి ప్రభావతి, మాజీ కార్పొరేటర్లు గందె మహేష్, ఎడ్ల అశోక్, ఐలేందర్ యాదవ్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, నాయకులు గంగాధర చందు,పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బ్యూటీ పార్లర్ అసోసియేషన్ నిర్వాహకులు, అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులు, వివిధ బ్యూటీ పార్లర్ల యజమానులు మరియు పెద్ద సంఖ్యలో నగర మహిళలు ఘనంగా పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN