Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో అటవీ భూముల్లో గుడిసెల తొలగింపు!
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం పరిధిలో అటవీ భూముల్లో నిర్మించిన గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు.
Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో అటవీ భూముల్లో గుడిసెల తొలగింపు!
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ పరిధిలోని బొంగుల కింది తండాలో అటవీ భూముల్లో నిర్మించిన గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (డీఆర్‌వో) ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ అటవీ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అడవులను, అటవీ భూములను ఆక్రమించుకోవడం, చెట్లను నరికివేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన సంరక్షణే లక్ష్యంగా అటవీ భూములను కాపాడేందుకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గుడిసెల తొలగింపు సమయంలో కొందరు తండావాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము గత 20 ఏళ్లుగా గుడిసెలు ఏర్పాటు చేసుకుని, వాటిలో గొర్రెలు, మేకలు, ఇతర పశువులను మాత్రమే ఉంచుతున్నామని అధికారులకు వివరించారు. దీనిపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. అటవీ భూముల్లో ఉన్న గుడిసెలను తొలగించాలని 20 రోజుల ముందే నోటీసులు జారీ చేశామని, అయినప్పటికీ స్పందించకపోవడంతో సిబ్బందితో కలిసి తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీవో జ్యోతినాయక్, కానిస్టేబుల్ అరుణ్, ఐదుగురు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.




