Sircilla: మధుప్రియ, శివజ్యోతిపై అసభ్య వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు

Sircilla: గాయనులు మధుప్రియ, శివజ్యోతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రాజ్ బోడపై తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నాయకులు సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 4:14 PM IST
Sircilla
X

Sircilla: మధుప్రియ, శివజ్యోతిపై అసభ్య వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు

Sircilla: తెలంగాణ ఫోక్ గాయనులు మధుప్రియ, శివజ్యోతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కళాకారిణుల ప్రతిభను, వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని ఖండిస్తూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న రజనీకాంత్ బోడ అలియాస్ రాజ్ బోడపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తార్ మాట్లాడుతూ.. జానపద గేయాలతో ప్రజల మనసులు గెలుచుకున్న మహిళా కళాకారిణులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది కేవలం మధుప్రియ, శివజ్యోతికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు.

మహిళా కళాకారిణులు తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో వారిని వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఫోక్ ఇండస్ట్రీ నాయకులు అన్నారు. మహిళా కళాకారిణుల గౌరవంపై దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తార్, కార్యవర్గ సభ్యులు జడల రమేష్, సభ్యులు ఎడమల శ్రీధర్ రెడ్డి, ఆకునూరి దేవయ్య, నక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మహిళా కళాకారిణులపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA