Kalva Srirampur: యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి: విజయ రమణారావు
Kalva Srirampur: యాసంగిలో నీటి ఎద్దడి దృష్ట్యా ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పిలుపునిచ్చారు. కాల్వ శ్రీరాంపూర్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
Kalva Srirampur: యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి: విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, గంగారం, కూనారం, మంగపేట, వెన్నంపల్లి, జాఫర్ ఖాన్ పేట, ఇదలాపూర్ గ్రామాల్లో ఐకేపీ, కూనారం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు సర్పంచులు, స్థానిక నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర రూ. 2461తో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తోందని, మొత్తం రూ. 2961 లభిస్తుందని తెలిపారు. కాంటా పూర్తి చేసి మిల్లుకు పంపిన మరుసటి రోజే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. మాయిశ్చర్ (తేమ) 15-16% ఉన్న ధాన్యానికి బయట మార్కెట్‌లో రూ. 3000 కంటే ఎక్కువ నగదు ఇస్తే అక్కడే విక్రయించుకోవచ్చని, రైతుకు లాభం చేకూరడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
అయితే వ్యాపారులకు అప్పు ఇవ్వవద్దని, ఆన్‌లైన్ చెల్లింపుల పేరుతో జరిగే మోసాల బారిన పడకుండా కేవలం 'స్పాట్ క్యాష్' (టేబుల్ క్యాష్)కే విక్రయించాలని సూచించారు. వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల భూగర్భ జలాలు పడిపోతాయని తెలిపారు. ఒక ఎకరం వరి పారించే నీటితో మూడు ఎకరాల ఆరుతడి పంటలు సాగు చేయవచ్చని చెప్పారు.
రైతులు మొక్కజొన్న, శనగలు, నువ్వులు, పెసర్లు, మినుములు వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని, యాసంగిలో వీటికి మంచి డిమాండ్ మరియు లాభదాయక ధర లభిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయానికి రోజుకు కనీసం 10 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందిస్తామని, విద్యుత్ కోతలపై వచ్చే పుకార్లను రైతులు నమ్మవద్దని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజన వేన సదయ్య, సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, ఏపిఎం లవ కుమార్, సీఈవో విజయేందర్ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.




