Karimnagar: బొమ్మకల్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి!

Karimnagar: కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ర్యాకం శంకర్ మృతి చెందారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 26 Nov 2026 10:50 PM IST
Karimnagar
X

Karimnagar: బొమ్మకల్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి!

కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామం కృష్ణానగర్‌కు చెందిన ర్యాకం శంకర్ విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బొమ్మకల్ గ్రామంలో తన విధులు ముగించుకొని గ్లామర్ మోటార్ సైకిల్‌పై కృష్ణానగర్‌కు తిరిగి వెళ్తుండగా, లారీ అసోసియేషన్ సమీపంలోని రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో గోదావరిఖని వైపు నుంచి పల్సర్ మోటార్ సైకిల్‌పై అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన మొమ్మ తాజొద్దీన్ అనే వ్యక్తి శంకర్‌ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో శంకర్ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర రక్తగాయమైంది. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి చూడగా, అప్పటికే శంకర్ మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతుడి భార్య ర్యాకం శారద ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోనే ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం శవ పంచనామా నిర్వహించి, వైద్యులచే పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ప్రమాదకర ప్రాంతాల వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి:

అనంతరం ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ రూరల్ పోలీసులు, కృష్ణానగర్ నుంచి బొమ్మకల్ వైపు వెళ్లే వాహనాలు రహదారిని దాటే ప్రాంతం ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రజలు, వాహనదారులు రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా వచ్చే వాహనాలను గమనించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా ప్రమాదాల నివారణకు సంబంధిత రహదారి అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చోట రోడ్డు డైవర్షన్, డివైడర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన గోదావరిఖనికి చెందిన మహమ్మద్ తాజొద్దీన్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని, అతడిని గుర్తించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టులో హాజరుపరచనున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN